టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ మరోసారి నోరుపారేసుకున్నారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అధికారులను తన ఇష్టమొచ్చినట్లు తిట్టారు.

దుందుడుకు చర్యలతో ఎప్పుడూ వివాదాల్లో ఉండే టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. జన్మభూమి కార్యక్రమంలో బాహాటంగానే అధికారులను ఉద్దేశించి బూతులు మాట్లాడారు. ఆయన బూతులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విప్‌ చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. గ్రామాధికారి నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగ కార్యక్రమం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు.  ఆయన తనదైన శైలిలో దుర్భాషలాడటంతో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న వారు నివ్వెరపోయారు.