విశాఖపట్నం: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకుని ఎమ్మెల్యే అవుదామనుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో తెగ బాధపడిపోయారు. 

ఎమ్మెల్యేగా గెలవకపోయాను, ప్రభుత్వ ఉద్యోగం ఊడగొట్టుకున్నాననంటూ కార్యకర్తలతో తన బాధను చెప్పుకున్నారు పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బంగారయ్య. ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించేందుకు ఆదివారం పాయకరావుపేటలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ ఆత్మీయ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తప్ప మిగిలిన వారు హాజరుకాకపోవడం ఆయన విస్మయానికి గురయ్యారు. నాలుగు మండలాల నుంచి కీలకనేతలు రాకపోవడంతో ఆయన కిమ్మనకుండా ఉండిపోయారు. అనంతరం వచ్చిన వారితోనే ఓటమిపై చర్చించారు. 

అనంతరం మాట్లాడిన ఆయన ఉద్యోగం పోయింది, ఓటమి మిగిలిందంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఎమ్మెల్యే అవుదామన్న ఆశతో రాజకీయాల్లోకి వచ్చానని కార్యకర్తలకు తెలిపారు. పాయకరావుపేట టీడీపీకి కంచుకోట అని ప్రచారం జరగడంతో పోటీకి దిగానని గెలుస్తానని ధీమాగా ఉన్నానని తెలిపారు. 

కానీ ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యిందన్నారు. ఉన్న ఉద్యోగం పోయింది, ఆశలు కూడా ఆవిరయిపోయాయంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినా రాజకీయాల్లో కొనసాగుతానని, ప్రజల మధ్యే తిరుగుతానని స్పష్టం చేశారు బంగారయ్య.