వైసిపి ఉనికి కోల్పోతోందా? టిడిపి నేతలు అలాగనే అంటున్నారు. బహుశా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాల నుండి వస్తున్న స్పందనతో ఇబ్బందులు పడుతున్నట్లు కనబడుతోంది. ఆ ఇబ్బందిని అథిగమించేందుకే వైసిపిపై విరుచుకుపడుతున్నారు.

బుధవారం టిడిపి ఎంఎల్ఏ బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ రోజురోజుకు ఉనికి కోల్పోతోందని విమర్శలు గుప్పించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్‌ యాత్రలు చేపట్టారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ రాష్ట్ర అభివృద్ధికి ఒక్క సలహా ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందన్న అక్కసుతోనే జగన్‌ పక్క రాష్ట్రాల వారిని రెచ్చగొడుతున్నారని బోండా విరుచుకుపడ్డారు. స్వార్ధం కోసం రైతులు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారంటూ ధ్వజమెత్తారు. జగన్ మాటలను, ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని బోండా ఉమా చెప్పటం గమనార్హం.