మమ్మల్ని రెచ్చగొట్టిన వారిపై చర్యలేవీ: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తీరుపై అచ్చెన్నాయుడు అసంతృప్తి
ఏపీ అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: తమను అసెంబ్లీ నుండి ఎందుకు సస్పెండ్ చేశారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తప్పుడు కేసును చంద్రబాబుపై బనాయించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తప్పుడు కేసుపై ఎలా చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు. కేసు లేనప్పుడు శాసనసభలో చర్చించి ఉపయోగం లేదని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై పెట్టిన కేసును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలని కోరితే తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు చెప్పారు.
ఇంత దారుణంగా శాసనసభను నిర్వహించడం ఎప్పుడూ చూడలేదన్నారు. 200 మంది మార్షల్స్ తో అసెంబ్లీని నిర్వహిస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు.17 మంది విపక్ష శాసనసభ్యులకు ప్రభుత్వం సమాధానం చెప్పుకొనే స్థితిలో లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహరించిన తీరును అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. అధికార పార్టీకి చెందిన సభ్యులే తమను రెచ్చగొట్టినా కూడ స్పీకర్ అధికార పార్టీ సభ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీని వైసీపీ తన ఇష్టారాజ్యంగా నడుపుకుటుందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా అసెంబ్లీలో వైసీపీ వ్యవహరిస్తుందని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఒక్క పైసా అవినీతి జరగలేదని అచ్చెన్నాయుడు చెప్పారు.
also read:రాజకీయ కక్షతోనే బాబుపై కేసు:క్షమాపణలకు బాలకృష్ణ డిమాండ్
రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీ డెంగ్యూ వ్యాధితో మరణించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు అచ్చెన్నాయుడు దృష్టికి వచ్చారు. దీంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును ఇంటికి తరలించాలని ఆయన కోరారు.