బాపట్ల జిల్లాలో విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేసిన ఘటనపై టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
బాపట్ల : పట్టపగలే నడిరోడ్డుపై కొందరు ఆకతాయిలు స్కూల్ విద్యార్థిని అత్యంత క్రూరంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా పట్టపగలే నడిరోడ్డుపై విద్యార్థిని సజీవదహనం చేసింది వైసిపి మూకలేనని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే దీనికి బాధ్యత వహించాలని ఎమ్మెల్యే అన్నారు.
సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని బలిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ఆదర్శంగా తీసుకుని వైసిపి నేతలు దారుణాలకు తెగబడుతున్నారని అనగాని అన్నారు. బాపట్ల జిల్లాలో పట్టపగలే ఓ విద్యార్థిని వైసిపి గూండాలు పెట్రోల్ పోసి తగలబెట్టారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థమవుతుందని అన్నారు. అధికార అండతో వైసిపి నాయకులు రెచ్చిపోతున్నారని... వీరి ఆగడాలను సామాన్యులు బలవుతున్నారని ఎమ్మెల్యే అనగాని ఆందోళన వ్యక్తం చేసారు.
బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ పై దాడిచేసి హతమార్చింది వైసీపీ మూకలేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన సోదరిణి వేధిస్తున్నవారిని హెచ్చరించడమే అమర్నాథ్ హత్యకు కారణమని తెలిపారు. తమను హెచ్చరించిన అమర్నాథ్ పై కోపంతో రగిలిపోయిన ఆకతాయిలు ఇవాళ ఒంటరిగా వెళుతుండగా పట్టుకున్నారని... వెంటతెచ్చుకున్న పెట్రోల్ అతడిపై పోసి నిప్పంటిచారని అన్నారు. శరీరమంతా పూర్తిగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ అమర్నాథ్ మృతిచెందినట్లు ఎమ్మెల్యే అనగాని తెలిపారు.
Read More బాపట్లలో దారుణం... తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన బాలుడు
గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై సీఎం జగన్ రెడ్డి ఉదాసీనంగా వ్యవహరించడమే ఈ దారుణాలకు కారణమని అనగాని అన్నారు. నేరగాళ్ల రాజ్యంలో దారుణాలు పెరుగున్నాయే కానీ ప్రజలకు రక్షణ ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు నేరం చేసిన అధికార వైసీపీ నేతలకే వత్తాసు పలుకడం బాధాకరమన్నారు. విద్యార్థి మృతి ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని... నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేసారు.
అసలేం జరిగిందంటే...
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు సమీపంలోని ఉప్పరివారిపాలెంకు చెందిన అమర్నాథ్ పదో తరగతి చదువుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివుతున్న అమర్నాథ్ పదో తరగతిలో మంచిమార్కులు సాధించాలని ట్యూషన్ కు కూడా వెళుతున్నాడు. రోజూ మాదిరిగానే ఇవాళ(శుక్రవారం) ఉదయం ట్యూషన్ కోసం ఒంటరిగా రాజోలుకు వెళుతుండగా ఊహించని ప్రమాదం ఎదురయ్యింది.
కొద్దిరోజుల క్రితమే తన సోదరిని వేధిస్తున్న ఆకతాయి యువకులను అమర్నాథ్ ను హెచ్చరించారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆకతాయి గ్యాంగ్ ఇవాళ అమర్నాథ్ రాజోలు వెళుతుండగా మార్గమధ్యలో కాపుకాసారు. ఒంటరిగా వెళుతున్న అమర్నాథ్ ను అడ్డగించిన వీరు వెంటతెచ్చుకున్న పెట్రోల్ ను అతడిపై పోసి నిప్పంటించారు. దీంతో అమర్నాథ్ మంటల్లో కాలిపోతూ చేసిన ఆర్తనాదాలు విని స్థానికులు గుమిగూడారు. వెంటనే మంటలు ఆర్పినప్పటికి అమర్నాథ్ శరీరమంతా కాలిపోయింది. అంబులెన్స్ లో హుటాహుటిన గుంటూరు జిజిహెచ్ కు తరలించి బాలుడి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసారు. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా విషమించడంతో అమర్నాథ్ ప్రాణాలు కోల్పోయాడు.
