నిద్రపోవడానికే టీచర్లు పాఠశాలలకు వెళ్తున్నారా.. ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనగాని ఫైర్
ఉపాధ్యాయులపై సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. నిద్రపోవడానికే టీచర్లు పాఠశాలలకు వెళ్తున్నారన్న వ్యాఖ్యలను ప్రభుత్వం, సీఎం, విద్యాశాఖ ఎందుకు ఖండించలేదని ఎమ్మెల్యే నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి టీచర్లంటే అంత చులకన ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్ధులను, ఉపాధ్యాయులను అథోగతి పాలు చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయులపై సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడిన మాటలను సత్యప్రసాద్ ఖండించారు. ఆ మాటలను ప్రభుత్వం ఖండించలేదంటే , దాని వెనుక అర్ధమేంటని ఆయన ప్రశ్నించారు. నిద్రపోవడానికే టీచర్లు పాఠశాలలకు వెళ్తున్నారన్న వ్యాఖ్యలను ప్రభుత్వం, సీఎం, విద్యాశాఖ ఎందుకు ఖండించలేదని ఎమ్మెల్యే నిలదీశారు.
Also REad: చంద్రబాబు తోఫాలిస్తే.. జగన్ ధోకా , ప్రభుత్వంపై పోరాడండి : మైనార్టీలకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని పిలుపు
ప్రవీణ్ ప్రకాశ్ వారానికొకసారి ఢిల్లీకి వెళ్తున్నారని.. అక్కడ నివసిస్తూ ఏపీకి గెస్ట్‌లా వచ్చి ఇక్కడి ఉపాధ్యాయులపై నోరు జారుతున్నారని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి సేవలందించారని.. ఆ సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించి 976 మంది టీచర్లను బలితీసుకున్నారని అనగాని ఫైర్ అయ్యారు. ఉపాధ్యాయులను రకరకాలుగా వేధిస్తున్నారని సత్యప్రసాద్ ఆరోపించారు. ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్‌తో ఉపాధ్యాయుల జీతాలకు ముడిపెట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులకు, మంత్రులకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తున్నారని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు.