ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు అనుభవం, అవగాహన లేదని విమర్శించిన ఆయన.. బాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

గతంలో అన్ని పరిశీలించాకే చంద్రబాబు భవనాన్ని అద్దెకు తీసుకున్నారని... ఈ భవనాన్ని 2007కు ముందే నిర్మించారన్న విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. భవనంలో ఇతర నిర్మాణాలకు ఎన్‌వోసీ కూడా తీసుకున్నారని.. భవన యజమాని రూ.18 లక్షల నాలా పన్ను కూడా చెల్లించారని అచ్చెన్నాయుడు తెలిపారు.

గత ప్రభుత్వ పాలనపై ఎంక్వైరీ వేయడం దౌర్భాగ్యమని.. జగన్ ఎంత వేధించిన వెనక్కి తగ్గబోమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ పోరాటం ఆగదని వెల్లడించారు.

ప్రజా సమస్యల్ని పక్కనబెట్టి కక్ష సాధింపులు చేస్తున్నారని జగన్‌పై ధ్వజమెత్తారు. కరువుతో అల్లాడుతున్న రైతుల సమస్యలు జగన్‌కు పట్టడం లేదని.. కానీ బాబును ఇబ్బంది పెట్టాలని మాత్రం చూస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్ర విభజనతో కట్టుబట్టలతో మనం అమరావతికి వచ్చామని .. ఎన్నో కష్టాలకు వోర్చి చంద్రబాబు తాత్కాలిక రాజధాని నిర్మించారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.