వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని గురించి విమర్శించకపోతే మంత్రులకు ఒక్కరోజు కూడా తెల్లారేట్లు లేదు చూడబోతుంటే. సమయం, సందర్భం అవసరం లేదు. విషయమేదన్నా సరే జగన్ను తిట్టటమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ ఉద్యమం వెనుకా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతీ పరిణామం వెనుకా ఉన్నది జగనే అని చాటాలన్నది ప్రభుత్వ తాపత్రయం.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని గురించి విమర్శించకపోతే మంత్రులకు ఒక్కరోజు కూడా తెల్లారేట్లు లేదు చూడబోతుంటే. సమయం, సందర్భం అవసరం లేదు. విషయమేదన్నా సరే జగన్ను తిట్టటమే పనిగా పెట్టుకున్నారు. ముద్రగడ కాపు ఉద్యమం వెనుకుంది జగనే అంటారు. రాష్టాభివృద్ధిని అడ్డుకుంటున్నది జగనే అని మండిపడతారు. ఎన్డీఏ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్ధులకు మద్దతిస్తే ఢిల్లీకి వెళ్ళి మోడి కాళ్ల మీద పడ్డారని ఎద్దేవా చేస్తారు.
ఇపుడిదంతా ఎందుకంటే, శుక్రవారం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు ఢిల్లీకి వెళ్ళారు లేండి. ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో సమీక్షలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే, సమీక్ష తర్వాత మీడియాతో దాదాపు అర్ధగంట మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతారనుకుంటే జగన్ పై మండిపడ్డారు. మొత్తం అర్ధగంటా జగన్ను తిట్టడానికే సరిపోయింది మంత్రికి. తాను ఢిల్లీ వచ్చిన పనేంటి, తాను మాట్లాడుతున్నదేంటి అని కూడా దేవినేని మరచిపోయారు.
తాజాగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, ఉపఎన్నికల ప్రచారం చేసేందుకు మంత్రి అమరనాధరెడ్డి నంద్యాలకు వెళ్లారు. వెళ్లిన పనేంటో చూసుకోకుండా జగన్ పైనే మంత్రి విరుచుకుపడ్డారు. కాపులకు రిజర్వేషన్ గురించి ముద్రగడ ఉద్యమం చేస్తుంటే ఉద్యమం వెనకాలున్నది జగనే అంటూ చంద్రబాబు మొదలు, మంత్రులందరూ ఒకటే దండకం చదువుతున్నారు. చివరకు తునిలో రైలు దహనం వెనకా, రాజధాని ప్రాంతంలో పంటలు తగలబడినా జగనే చేసాడన్నారు.
అంటే, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ ఉద్యమం వెనుకా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతీ పరిణామం వెనుకా ఉన్నది జగనే అని చాటాలన్నది ప్రభుత్వ తాపత్రయం. మంత్రులు సోమిరెడ్డి, నిమ్మకాయల, చింతకాయల, నారాయణ, పరిటాల, కింజరాపు ఇలా..ఒకరేమిటి ప్రతీ ఒక్కరిదీ అదే వరస. ప్రతిపక్ష నేతగా జగన్ అసలు ఉద్యమాలే చేయకూడదన్నది ప్రభుత్వ వాదనగా కనిపిస్తోంది.
పదిసంవత్సరాలు టిడిపి ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు ఏమి చేసారో ఇపుడు జగనూ అదే చేస్తున్నారు అందులో తప్పేమిటి? అధికారపార్టీ ఒక విషయం మరచిపోతోంది. ఇరవైనాలుగు గంటలూ జగన్ గురేంచే మాట్లాడటం వల్ల చంద్రబాబు, మంత్రులే జగన్ కు కావాల్సినంత ప్రచారం చేస్తున్నారు.
