ఎంఆర్ఓపై చింతమనేని దాడి చేసిన ఘటనలొ ఏకంగా చంద్రబాబే స్వయంగా పంచాయితీ చేయటంతో తమ్ముళ్లు మరింత రెచ్చిపోతున్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలకు ఏమైంది? ఇదేదో సిగిరెట్ ప్రకటనలాగ ఉందనుకుంటున్నారా? నిజంగా అలానే అనుకుంటున్నారు పలువురు టిడిపి నేతల ప్రవర్తన గురించి. పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పలువురు టిడిపి నేతలు తమకు గిట్టని వారిపై దాడులు చేయటం ఎక్కువైపోయింది.

అధికారంలోకి రాగానే కొందరు నేతలు మరీ బరితెంగిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కూడా అటువంటి వారికి లైసెన్సులు ఇచ్చేసినట్లే కనబడుతోంది. ఎందుకంటే, గడచిన రెండున్నరేళ్ళలో పలువురు టిడిపి నేతలు ఎక్కడ దాడులు చేస్తున్నా వారిపై ఇంత వరకూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. పైగా దాడులకు గురైన వారిదే తప్పని తేల్చేస్తుండటం కొసమెరుపు.

టిడిపి నేతల ధౌర్జాన్యాలకు కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నంలో ఎందరో గురయ్యారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ మహిళలపై ధౌర్జాన్యానికి దిగారు.

తమ డిమాండ్ల సాధనకోసం ఏలూరు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న మహిళలపై చింతమనేని ధౌర్జాన్యానికి దిగటం గమనార్హం.

ఇదే చింతమనేని గతంలో కృష్ణా జిల్లాలోని ఓ మహిళా ఎంఆర్ఓ వనజాక్షిపై ధౌర్జన్యానికి దిగటం అప్పట్లో సంచలనం. ఆ తర్వాత అటవీ శాఖ సిబ్బందిపైన కూడా దాడులు చేసారు. ప్రత్యర్ధులపై దాడులు చేయటం చింతమనేనికి సాధారణమైపోయింది.

ఇక, విజయవాడ, గన్నవరం, మైలవరం ప్రాంతాల్లో కొందరు టిడిపి నేతలు పోలీసులపైనే దాడులు చేసారు. అందరూ చూస్తుండగానే ఓ ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్ళను కొట్టారు. అయినా వారిపై ఎటువంటి చర్యలు లేవు.

చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, ఐరాలా మండల కేంద్రాల్లో పలువురు టిడిపి నేతలు స్ధానిక ఎస్ఐ, కానిస్టేబుళ్ళను నడి రొడ్డులో కొట్టినా చర్యలు లేవు. దాడులకు గురైన పోలీసులు ఫిర్యాదు చేస్తున్న ఉన్నతాధికారులు తీసుకోలేదు.

అదేవిధంగా గుంటూరు మండలంలో కొందరు నేతలు స్ధానిక రెవిన్యూ యంత్రాంగంపై దాడి చేసి దారుణంగా గాయపరిచారు. అయినా వారిపై కేసులు నమోదు కాలేదు. అలాగే, ఉభయగోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో కూడా తమ్ముళ్ళు రెచ్చి పోతున్నారు.

వారంతా తమ ప్రత్యర్ధులపై దాడులు చేస్తుంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ ప్రభుత్వ యంత్రాంగంపైనే దాడులు చేస్తున్నారు. అయినా ఇంత వరకూ ఎవరిపైనా చర్యలు లేవు. పైగా ఎంఆర్ఓపై చింతమనేని దాడి చేసిన ఘటనలొ ఏకంగా చంద్రబాబే స్వయంగా పంచాయితీ చేయటంతో తమ్ముళ్లు మరింత రెచ్చిపోతున్నారు.