మంత్రివర్గంలో చర్చించిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు బయటకు వెళ్ళిపోవటంతో చంద్రబాబుకు అనుమానం మొదలైందని ప్రచారం
మంత్రివర్గంలో కోవర్టులున్నారా? రాజకీయ వర్గాల్లో ఈ విషయంపైనే ఇపుడు చర్చ సాగుతోంది. అందుకనే చంద్రబాబునాయడు ఒక్కొక్కరి అధికారాల్లో కత్తెర వేస్తున్నట్లు పార్టీలో చర్చ మొదలైంది. తాజాగా రెవిన్యూమంత్రి కెఇ కృష్ణమూర్తి అధికారాలను లాగేసుకోవటంతో సర్వత్రా అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకుముందే గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్ బాబు అధికారాలను కూడా సిఎం లాగేసుకున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలోని మిగిలిన వారిని ఒకలాగ, పై ఇద్దరినీ మాత్రం మరో లాగ సిఎం ట్రీట్ చేస్తున్న విషయంపై చర్చ జరుగుతోంది.
ఇటీవలే రావెల వైసీపీకి చెందిన ఓ కీలక నేత ఇంటికి వెళ్ళి నాలుగు గంటలు గడిపారని ప్రచారం జరుగుతోంది. ఎవరికీ తెలీకుండా చివరకు గన్ మెన్లు కూడా లేకుండా ఒంటరిగా వెళ్ళారని ఇంటెలిజెన్స్ కూడా సిఎంకు నివేదిక అందించింది. రావెలను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు క్లాస్ పీకారని కూడా ప్రచారంలో ఉంది. తనను మంత్రివర్గం నుండి తప్పిస్తే సమయం చూసుకుని వైసీపీలోకి వెళ్ళిపోదామని రావెల నిర్ణయించుకున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఇంటెలిజెన్స్ నివేదికను తెప్పించుకున్న దగ్గర నుండి చంద్రబాబు మంత్రిని నమ్మటం లేదట. అందుకనే శాఖాపరమైన కీలక నిర్ణయాలన్నీ చంద్రబాబే తీసుకుంటున్నాని.
అదేవిధంగా, రెవిన్యూశాఖతో పాటు రాజధాని ప్రాంతంలో భూ సమీకరణపై మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలన్నీ కెఇ పేషీ నుండే లీక్ అవుతున్నాయని చంద్రబాబు అనుమానమట. అందుకనే ముందుజాగ్రత్తగా భూసమీకరణ వ్యవహారాలపై మొదటి నుండీ కెఇని చంద్రబాబు దూరంగా పెట్టారు. ఈ కారణాలతోనే పై ఇద్దరి అధికారాల్లో కోత పడినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. గంటా విషయంలో కూడా చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ సామాజిక వర్గ సమీకరణతో పాటు నారాయణ వియ్యంకుడు కూడా కావటమే గంటాను కాపాడుతోందట.
