ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్ధులుగా తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలకు వైసీపీ అధినేత, సీఎం జగన్ ఛాన్స్ కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏపీలో జనాలు లేరా అంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ నుంచి భర్తీ కానున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి వైసీపీ నుంచి నలుగురికి (ysrcp rajya sabha candidates)అవకాశం కల్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలను తమ పార్టీ తరపున అభ్యర్ధులుగా ఖరారు చేశారు. అయితే వీరిలో తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య (r krishnaiah) , నిరంజన్ రెడ్డిలకు (niranjan reddy) అవకాశం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నేతలు, ప్రముఖులు లేరా అంటూ ప్రతిపక్ష టీడీపీ (tdp) మండిపడుతోంది. 

తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు క్రాంతి కుమార్ స్పష్టం చేశారు. వైసీపీ బీసీలకు ఇవ్వాలనుకుంటే ఏపీలో బీసీలు చాలా మంది ఉన్నారని దుయ్యబట్టారు. వైసీపీ కోసం పని చేసిన బీసీ నేతలు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. వారందరినీ కాదని తెలంగాణ వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయనంతో సీఎం జగన్ ఏపీలోని బీసీలను అవమానించారని క్రాంతి కుమార్ మండిపడ్డారు.

అటు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (ayyanna patrudu) సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పెద్ద‌ల స‌భ‌కి వెళ్లే అర్హత ఏపీలోని 140కి పైగా వున్న బీసీ కులాల‌లో ఏ ఒక్క నేత‌కీ లేదా జగన్ రెడ్డి గారు? లేదంటే ఏపీలో వున్న బీసీలు బీసీలే కాద‌ని మీర‌నుకుంటున్నారా? నిధులు,నీళ్లు, నియామకాలు నినాదంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ’ అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు. 

మీరేమో సీఎం అయిన మొద‌టి రోజు నుంచే ఏపీ నిధులు, నీళ్లు, నియామ‌కాల‌న్నీ తెలంగాణ‌కి దోచిపెడుతున్నారు. నిధులు, విధుల‌తోపాటు కూర్చోవ‌డానికి కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేష‌న్లు ఏపీ బీసీల‌కి విదిల్చి, తెలంగాణ వాళ్లకు అత్యున్న‌త రాజ్య‌స‌భ స్థానాలు కట్టబెట్టడం అంటే ఏపీలో వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల నేత‌ల‌కి వెన్నుపోటే’అంటూ అయ్యన్న దుయ్యబట్టారు. 

ALso Read:టీడీపీ- జనసేన పొత్తు : బీసీలనే నమ్ముకుంటోన్న జగన్.. ఆర్ కృష్ణయ్యతో పవన్‌కు చెక్ సాధ్యమేనా ..?

అయితే జగన్ ఇప్పుడే కాదు.. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే తెలంగాణ వారికి అవకాశం కల్పించారు. తన సలహాదారులుగా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి (k ramachandra murthy) , దేవులపల్లి అమర్‌లకు (devulapalli amar) బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ ర్యాంక్, జీతభత్యాలను సైతం ప్రకటించారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. కె. రామచంద్రమూర్తికి ప్రజా విధానాల సలహాదారుగా, అమర్‌కు జాతీయ మీడియా సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. 

రామచంద్రమూర్తికి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఛాంబర్‌ను కేటాయించారు. విధానపరమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు.. అధ్యయనం చేసేందుకు నియమించినప్పటికీ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలోనే రామచంద్రమూర్తి రాజీనామా చేయడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. దేవులపల్లి అమర్‌కి సైతం ఎలాంటి పని వుండటం లేదు. అయితే వీరిద్దరూ జగన్‌ మీడియా సంస్థలైన సాక్షి ఛానెల్, పత్రిలో కీలక హోదాల్లో పనిచేశారు. జగన్ అధికారంలోకి రావడం వెనుక వారు కీలక సలహాలు ఇచ్చారని, పవన్ చేజిక్కిన వెంటనే వారిని సలహాదారులుగా చేసుకుని రుణం తీర్చుకున్నారని ప్రచారం జరిగింది. 

లాయర్ నిరంజన్ రెడ్డి విషయానికి వస్తే.. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఆయన ... అప్పట్లో జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసును వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌తో సాన్నిహిత్యం బాగా పెరిగింది. నిర్మాతగా కూడా రాణిస్తున్న నిరంజన్ రెడ్డి.. అప్పట్లో టికెట్ ధరల పెంపు విషయంలో చిరంజీవిని జగన్‌తో భేటీ అయ్యేందుకు సహకరించారని కూడా ఇండస్ట్రీలో టాక్. 

ఇక.. ఆర్ కృష్ణయ్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీని (tdp) జగన్ మరోసారి కోలుకోలేని దెబ్బ కొట్టారని విశ్లేషకులు అంటున్నారు. బీసీ అంటే కృష్ణయ్య.. కృష్ణయ్య అంటే బీసీ అన్నట్లుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 1994లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి నాటి నుంచి పోరాటం చేస్తున్నారు. ఇన్నేళ్లలో ఆయనను ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు. ఎన్నికలప్పుడు మాత్రం వాడుకుని వదిలేసింది. 

కాకపోతే.. 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అంతేకాదు నాడు తెలంగాణ సీఎం అభ్యర్ధిగా ఆర్ కృష్ణయ్యను టీడీపీ తెరపైకి తెచ్చింది. అనంతరకాలంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా వుంటున్న ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు మద్ధతు ప్రకటించిన కృష్ణయ్య.. ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు . 

ఏపీలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన పొత్తు (tdp janasena alliance) కుదుర్చుకుంటాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్ (pawan kalyan) ప్ర‌భావంతో మెజార్టీ కాపులు టీడీపీ వైపు పోయినా, బీసీల‌ను పూర్తిస్థాయిలో త‌న వైపు నిలుపుకోవ‌చ్చ‌నే ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఆర్‌.కృష్ణయ్య‌, బీద మ‌స్తాన్‌రావుల‌కు జగన్ రాజ్య‌స‌భ సీట్లు ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏది ఏమైనా కృష్ణయ్య విషయంలో జగన్ స్కెచ్ రానున్న రోజుల్లో చెమటలు పట్టించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ తనకు సాయం చేసిన వారిని , తనకు భవిష్యత్తులో ఉపయోగపడతారు అనుకున్న వారికే ఛాన్స్ ఇచ్చారు జగన్. అందుకే వారు ఏపీనా, తెలంగాణనా అన్నది చూడలేదు.