ఏపీ ఎన్నికల్లో తామూ వేలు పెడతామని తెలంగాణ ఎన్నికలకు ముందు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కి తాము మద్దతు ఇస్తామని కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీలోని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  ఏపీ సీఎం చంద్రబాబుపై అడ్రస్ లేని వారు కూడా అవాకులు, చవాకులు పేలుస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న  ఫైర్ అయ్యారు.

రాజకీయాల్లో సుదీర్ఘఅనుభవం ఉన్న చంద్రబాబుని కేసీఆర్ గల్లీలీడర్ అని వ్యాఖ్యానించారని.. కేసీఆర్ ఒక సిల్లీ లీడర్ అని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లోకి వస్తామంటూ కేసీఆర్, కేటీఆర్, ఓవైసీలకు ఢిల్లీ వెళ్లి ప్రచారం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో అక్రమంగా గెలిచిన టీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు.

ఇదే విషయంపై మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ...  కేసీఆర్, ఓవైసీ ఎక్కడి నుంచైనా పోటీచేయవచ్చన్నారు. గతంలో నంద్యాలలో పోటీ చేసిన ఓవైసీకీ ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.  ముస్లింలు అధికంగా ఉన్న నంద్యాలలో ఓవైసీ, కర్నూలులో కేసీఆర్ పోటీచేయవచ్చన్నారు.

కేసీఆర్, అసద్దుద్దీన్ కి తాము స్వాగతం పలుకుతున్నామని.. కర్నూలు, నంద్యాలలో పోటీచేయాలని.. ప్రజలు ఎవరికి పట్టం కడతారే తెలుస్తుందని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.