Kanchikacharla : దళిత యువకుడి ముఖంపై మూత్రంపోసినోళ్లను... దళిత మంత్రే కాపాడుతున్నారట...
అగ్రకుల దురహంకారంతో దళిత యువకుడిపై దాడికి పాల్సడటమే కాదు ముఖంపై మూత్రం పోసి అవమానించిన నిందితులను దళిత సామాజికవర్గానికి చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో దళిత యువకుడిపై జరిగిన దాడి రాజకీయ విమర్శలకు దారితీసింది. కుల దురహంకారంతో కొందరు యువకులు కంచికచర్ల అంబేద్కర్ నగర్ కు చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ పై అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారు. దెబ్బలు తాళలేక దాహంగా వుందని నీళ్ళు అడిగితే ముఖంపై మూత్రం పోసి అమానుషంగా వ్యవహరించారు. ఇలా దళిత యువకుడితో అమానుషంగా వ్యవహరించిన నిందితులను కాపాడేందుకు దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రయత్నిస్తున్నారని టిడిపి సంచలన ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో మంత్రి జోక్యం చేసుకుంటున్నారని... నిందితులను కాపాడేందుకు పోలీసులతో కూడా మంత్రి మాట్లాడినట్లు ఆరోపిస్తున్నారు.
కంచికచర్ల ఘటనను ఖండించిన మంత్రి ఆదిమూలపు తెలగుదేశం పార్టీ నాయకులపై సీరియస్ అయ్యారు. దళిత యువకుడు శ్యామ్ కుమార్ పై జరిగిన దాడి బాధాకరమని మంత్రి అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందినవెంటనే పోలీసులు స్పందించారని... దాడికి పాల్పడిన వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని మంత్రి తెలిపారు.
అయితూ దళిత యువకుడిపై దాడి ఘటనను టిడిపి నాయకులు రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తోందని... అందుకోసమే తనపేరును మధ్యలోకి లాగుతున్నారని అన్నారు. దళిత యువకుడిపై దాడిచేసిన వ్యక్తులను కాపాడేందుకు దళిత మంత్రే ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజంగా తాను పోలీసులతో మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ మంత్రి ఆదిమూలపు సవాల్ విసిరారు.
అసలేం జరిగింది :
కంచికచర్ల అంబేద్కర్ నగర్ కు చెందిన శ్యామ్ కుమార్ అనే దళిత యువకుడికి హరీష్ రెడ్డి అనే వ్యక్తితో విబేధాలున్నాయి. గతంలో వీరిమద్య గొడవలు జరగ్గా వీటిని మనసులో పెట్టుకున్నాడు హరీష్ రెడ్డి. కులదురహంకారంతో రగిలిపోయిన అతడు దళిత యువకుడిపై దాడికి సిద్దమయ్యాడు. మాట్లాడేది వుందని చెప్పి గత బుధవారం శ్యామ్ ను పిలిపించాడు హరీష్. మరో ఐదుగురితో కలిసి శ్యామ్ ను కారులో ఎక్కించుకుని రోడ్డుపై తిప్పుతూనే అత్యంత దారుణంగా చితకబాదాడు. గుంటూరువైపు కారును పోనిస్తూ దారిపొడవునా కుల్లబొడిచారు.
రక్తాలు వచ్చేలా చితకబాదడంతో నొప్పి భరించలేక అరిచి అరిచి గొంతు ఎండిపోవడంతో శ్యామ్ కుమార్ తాగేందుకు నీరు అడిగాడు. అయినా కనికరించని హరీష్ గ్యాంగ్ మరింత అమానుషంగా వ్యవహరించింది. రహదారి పక్కన కారు ఆపి గాయాలతో విలవిల్లాడిపోతున్న శ్యామ్ ను బయటకు దించారు. నీళ్లు కావాలన్న అతడి ముఖంపై మూత్రం పోసి అవమానించారు. ఇలా రాత్రంతా దళిత యువకుడిని కారులో తిప్పుతూ చిత్రహింసలు పెట్టాడు హరీష్ రెడ్డి.
ఇలా అగ్రకుల దురహంకారంతో జరిగిన దాడితో తీవ్రంగా గాయపడ్డ శ్యామ్ కుమార్ ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే వున్నట్లు సమాచారం. దళిత యువకుడిపై జరిగిన దాడిపై ప్రతిపక్ష టిడిపి సీరియస్ అవుతోంది. వైసిపి ప్రభుత్వంలో దళితులను రక్షణ లేకుండా పోతోందని ఆరోపిస్తున్నారు.