ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెలుగు దేశం పార్టీ నాయకులు ఈరోజు కలిశారు. నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర‌కు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెలుగు దేశం పార్టీ నాయకులు ఈరోజు కలిశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, వర్ల రామయ్య ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర‌కు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల దుశర్యల ఆధారాలను గవర్నర్‌కు నివేదించినట్టుగా టీడీపీ నేతలు తెలిపారు. 

పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించటం, ప్రజలతో మాట్లాడకుండా మైక్ నియంత్రించడం, కేసుల నమోదు, వాహనాలు సీజ్ వంటి పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్పారు. లోకేష్‌కు ప్రాణహాని ఉందనే ఆందోళన కలుగుతుందని అన్నారు. ఎక్కడెక్కడా భద్రతా లోపాలు ఉన్నాయో చూసుకుని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు డ్రోన్ ద్వారా తీసి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్‌కు పంపుతున్నారని ఆరోపించారు. 

బొండా ఉమా మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రలో డీఐజీ రఘురామిరెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ రఘరామిరెడ్డి.. లోకేష్ పాదయాత్రకు సంబంధించి పోలీసులకు ఆదేశాలు ఇస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.