చంద్రబాబు అరెస్ట్.. త్వరగా విడుదలవ్వాలంటూ టీడీపీ శ్రేణుల పాదయాత్ర, ప్రొద్దుటూరు నుంచి ప్రారంభం
చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ 60 మంది పార్టీ కార్యకర్తలతో కలిసి ఈ యాత్ర చేపట్టారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. తాజాగా చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.
ఈ మేరకు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు కాలినడకన బయల్దేరారు. దాదాపు 230 కిలోమీటర్ల దూరాన్ని వారం రోజుల్లో పూర్తి చేస్తామని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ 60 మంది పార్టీ కార్యకర్తలతో కలిసి ఈ యాత్ర చేపట్టారు. బుధవారం ప్రొద్దుటూరులోని తన నివాసం నుంచి ఆయన ఈ యాత్ర మొదలుపెట్టారు.
ALso Read: టీడీపీ ముఖ్యనేతలతో భువనేశ్వరి భేటీ.. ‘బాబుతో నేను’ పేరుతో టీడీపీ నిరసన కార్యక్రమాలు...
ఈ సందర్భంగా ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం శ్రమించే చంద్రబాబుపై కక్షగట్టిన జగన్ జైలుకు పంపాడని మండిపడ్డారు. కుట్ర చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేశారని.. తాను జైలుకు వెళ్లొచ్చానని, మిగిలినవారిని కూడా జగన్ జైలుకు పంపిస్తున్నాడని ప్రవీణ్ ఫైర్ అయ్యారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసింది జగనేనని ఆయన ఆరోపించారు. జగన్‌కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను బయటకు తీస్తామని ప్రవీణ్ స్పష్టం చేశారు.