అమరావతి: కరోనా కష్టకాలంలో వున్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపి దారుణంగా ప్రవర్తిస్తోందని మాజీ మంత్రులు దేవినేని ఉమ, అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కేంద్రం వేలకోట్లు ఇస్తున్న వాటిని ప్రజలదాక చేర్చడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందన్నారు. లాక్ డౌన్ కొనసాగిన ఈ మూడు నెలలు కరెంట్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

''లాక్ డౌన్ నేపథ్యంలో 3నెలల విద్యుత్ బిల్లులను రద్దు చెయ్యాలి, కొత్తగా ప్రవేశపెట్టిన శ్లాబులను తక్షణం రద్దుచేసి పాత శ్లాబులనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 
@JaiTDP అధ్యక్షుడు చంద్రబాబు గారి పిలుపుమేరకు నేడు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది'' అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 
 
''కరోనా కష్టకాలంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను దోచుకుంటారా? 3నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేయాలి పాతస్లాబు విధానంలోనే బిల్లులను వసూలుచేయాలి కోటి 35లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు చార్జీలు పెంచబోమని మీరు ఇచ్చినహామీ ఏమయ్యిందని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు'' అని నిలదీశారు.
 
''బ్రతుకుతెరువు కోసం రోడ్డెక్కిన భవననిర్మాణకార్మికులు, ఉపాధిహామీకూలిలు చిరువ్యాపారులు సామాన్య మధ్యతరగతి వారి "బతుకుబళ్లు" సీజ్ చేశారు. స్టేషన్లముందు లక్షలాదివాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి. పెనాల్టీలు లేకుండా తక్షణం వాహనాలు విడుదల చేయమని ప్రజలు అడుగుతున్నారు స్పందించండి వైఎస్ జగన్ గారు'' అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. 

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో రోజుకో సమస్య ఉత్పన్నం అవుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కరెంటు బిల్లులు పెంచలేదని ప్రభుత్వం అబద్దాలు చెబుతోంది... ఉపాధిలేక అల్లాడుతున్న ప్రజలు కరెంటు బిల్లులు ఎలా కడతారు? అని అన్నారు. టీడీపీ హయాంలో కరెంటు బిల్లు ఒక్కసారి కూడా పెంచలేదని గుర్తుచేశారు. 

విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతున్నామని అన్నారు. కరెంటు బిల్లులపై వినియోగదారులు ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. కరోనా సాయం కింద ఏపీకి కేంద్రం వేల కోట్లు ఇస్తోందని తెలిపారు. ఏప్రిల్, మే నెలల కరెంటు బిల్లులు ప్రభుత్వం మాఫీ చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.