పోలవరం వెళ్ళినా టిడిపికి జగన్ గోలేనా ?

First Published 16, Nov 2017, 3:05 PM IST
Tdp leaders criticizing jagan even from the polavram site also
Highlights
  • తెలుగుదేశంపార్టీ నేతలకు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రం కనబడుతున్నారేమో?

తెలుగుదేశంపార్టీ నేతలకు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రం కనబడుతున్నారేమో? ప్రజా సంకల్పయాత్ర ప్రారంభానికి ముందు, తర్వాత కూడా ఏదో ఒక సందర్భం సృష్టించుకోవటం జగన్ పై ఆరోపణలు, విమర్శలకు దిగటమే పనిగా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మంత్రులకు, నేతలకు టైం టేబుల్ ఇచ్చి మరీ జగన్ ను తిట్టిస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఇదంతా ఎందుకంటే, గురువారం నుండి వరుసగా నాలుగు రోజుల పాటు అసెంబ్లీకి శెలవులు వచ్చాయి. అందుకని ఎంఎల్ఏలకు ఎడ్యుకేషన్ టూర్ గా ఉంటుందని చంద్రబాబునాయుడు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల టుర్ అరేంజ్ చేశారు. రెండు ప్రాజెక్టల టూర్ ముఖ్య ఉద్దేశ్యమేంటంటే, ప్రాజెక్టుల గురించి ప్రజా ప్రతినిధులకు పూర్తి అవగాహన రావాలని. వారికేదైనా అనుమానాలుంటే ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు నివృత్తి చేస్తారు. ఎంఎల్ఏలు కూడా చేయాల్సిందేంటంటే, పై ప్రాజెక్టుల పరిధిలో సాగు, తాగు నీరందే ప్రాంతాలేవి, సాగు విస్తీర్ణం ఎంత పెరుగుతుంది, రైతులకు జరిగే మేలేంటి తదితరాలు అడిగి తెలుసుకోవాలి.

అయితే, వెళ్ళిన పనిపై ఎంత శ్రద్ద పెట్టారో తెలీదు గానీ పోలవరం సైట్ కు వెళ్ళగానే మంత్రి పరిటాల సునీత తదితరులు జగన్ పై విరుచుకుపడ్డారు. కేంద్రం నుండి నిధులు తెచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయయటానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే, జగన్ మాత్రం ఆరోపణలు, విమర్శలు చేస్తున్నట్లు మండిపడ్డారు. కళ్ళున్న కబోది, అజ్ఞాని అంటూ జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ కు నీటి విలువ తెలియదట. రాయలసీమతో పాటు పులివెందులకు కూడా చంద్రబాబు నీళ్ళిచ్చింది కనబడటం లేదా ? అంటూ నిలదీసారు. రాయలసమీకు నీటిని తరలిస్తున్నారంటూ గోదావరి రైతులను జగన్ రెచ్చి గొడుతున్నారంటూ రెచ్చిపోయారు. చివరగా టిడిపి నేతలు చెప్పిందేమంటే, మరో 20 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారట.

loader