అక్రమ ఇసుకవ్యాపారం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారి అనుచరుల జాబితాను టీడీపీ నేతలు మంగళవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా చంద్రబాబునాయుడు తలపెట్టిన దీక్షకు ప్రజలు మద్ధతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

ఇసుకకొరతని ప్రభుత్వమే సృష్టించిందని, వైసీపీనేతల స్వార్థప్రయోజనాలు, అక్రమార్జన కోసం నిర్మాణరంగాన్ని బలిచేసిందని ఆయన దుయ్యబట్టారు. లక్షలాదిమంది భవననిర్మాణ కార్మికులు, వారి కుటుంబాలు అన్నమో రామచంద్రా అనే దుస్థితిని ప్రభుత్వమే కల్పించిందని శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. 

Also read:ఇసుక రవాణాలో 67 మంది వైసీపీ నేతలు వీరే: టీడీపి జాబితా

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... అధికారపార్టీకి చెందిన ఇసుకాసురులు ఏ విధంగా ఇసుక అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తు న్నారో, ఎలా ఇసుక వ్యాపారంలో దోపిడీకి పాల్పడుతున్నారో పూర్తి వివరాలతో ప్రజల ముందుంచామన్నారు.

ఆర్టీసీకార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ వ్యాప్తంగా అన్నిపార్టీలు, ప్రజాసంఘాలు, నాయకులు కలిసి వచ్చినట్లుగానే చంద్రబాబునాయుడు దీక్షకు కూడా అన్ని వర్గాలు మద్ధతు పలకాలని ఆయన స్పష్టం చేశారు. 

బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో క్విడ్‌ప్రోకోకు పాల్పడి, భూములమ్మిన వారు ఆఖరికి ఇసుకను అమ్ముకుంటూ, వేలకోట్లు దోపిడీ చేశారని బొండా మండిపడ్డారు. వరదలవల్లే ఇసుక అందుబాటులో లేదని చెబుతున్న మంత్రులే ఇసుక వ్యాపారంలో మునిగి తేలుతున్నారన్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వంలో రూ.3వేలకు ఇసుక లభించినప్పుడు ఇసుక మాఫియా అని గగ్గోలుపెట్టిన వైసీపీ నేతలు, జగన్‌ జమానాలో లారీ ఇసుక బ్లాక్‌మార్కెట్‌లో రూ.40వేలకు అమ్ముతుంటే ఎందుకు నోరెత్తడం లేదని బొండా ప్రశ్నించారు.

13 జిల్లాల్లో 40మందికి పైగా కార్మికులు చనిపోతే, కేవలం ఐదుగురికి మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ముఖ్యమంత్రి చేతులు దులుపుకున్నారని ఉమా ఎద్దేవా చేశారు. తన చర్యలను ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడని బొండా మండిపడ్డారు.

భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో ధర్నాచేస్తున్న భవననిర్మాణకార్మికులను వైసీపీ నేతలు బెదిరించడం జరిగిందని, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ, ప్రజాగ్రహాన్ని పెంచుకుంటూ పోతోందని మండిపడ్డారు. 

మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. సిమెంట్‌ కంపెనీలతో కుమ్మక్కయిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా చేసి, అధికార పార్టీ నేతలకు మాత్రం అది లభించేలా చేశాడని ఆయన ఆరోపించారు. 

వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఇసుక మాఫియానే వైసీపీ నేతలని, వైసీపీ నేతలే ఇసుక మాఫియా అని రామయ్య తేల్చిచెప్పారు    ముఖ్యమంత్రి మారువేషంలో రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద కాపలాకాస్తే, ఇసుక ఎలా పక్క రాష్ట్రాలకు తరలిపోతుందో తెలుస్తుందన్నారు.

Also Read:నువ్వు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకో.. ఎవడొద్దన్నాడు: జగన్‌కు పవన్ కౌంటర్

ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణే ఒక సమీక్షా సమావేశంలో ఇసుక బయటకు ఎలా వెళ్లిపోతుందని నిలదీశారని, వారి పార్టీ ఎంపీనే అందుకు కారణమని తెలిసి తేలుకుట్టిన దొంగలా మిన్నకుండి పోయారన్నారు. గుంటూరు జిల్లాలో ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇసుక కోసం తగాదా పడిన విషయం జిల్లా వాసులందరికీ తెలుసునన్నారు. 

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. 16 నెలలు జైలు జీవితం గడిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, తనకు తెలిసిన దోచుకొని, దాచుకునే విద్యను తన పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేర్పారని, వారంతా ఇసుకను  అక్రమంగా పక్కరాష్ట్రాలకు తరలిస్తూ, అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపించారు.