చంద్రబాబుకు బెయిల్... టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుని టిడిపి సంబరాలు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి బెయిల్ లభించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటున్నారు.
గుంటూరు : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి చాలాకాలంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి బెయిల్ లభించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతిపక్ష నేతకు ఏపీ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో 53 రోజుల జైలుజీవితం తర్వాత చంద్రబాబు బయటకు రానుండటంతో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట టిడిపి కార్యాలయం వద్ద కడియాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు రావడం సంతోషంగా వుందన్నారు నాయకులు. కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు. దీంతో నరసరావుపేట టిడిపి ఆఫీస్ వద్ద సందడి నెలకొంది.
ఈ సందర్భంగా చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ... ఏ తప్పూ చేయకున్నా కేవలం కక్షసాధింపుతోనే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఇరికించారని అన్నారు. ఈ వయసులో ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారని అన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకు హైకోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేయడం చాలా సంతోషకరమని అరవింద్ బాబు అన్నారు.
Read More జైల్లోంచి బయటకు రాగానే నేరుగా హైదరాబాద్ కు... చంద్రబాబు కోసం ప్రత్యేక విమానం రెడీ ...
చంద్రబాబును అవినీతి చేసినట్లు ఎలాంటి ఆదారాలు లేకుండానే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అన్నారు. దీంతో ఆయన కుటుంబమే కాదు టిడిపి శ్రేణులంతా ఆవేదనకు గురయ్యారని అన్నారు. బాధలో వున్న సమయంలో చంద్రబాబు కుటుంబానికి నరసరావుపేట టిడిపి నాయకులు, కార్యకర్తలు అండగా వున్నారని... వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అరవింద్ బాబు అన్నారు.
ఇక చంద్రబాబుకు బెయిల్ లభించడంతో తిరువూరు నియోజకవర్గంలో టిడిపి సంబరాలు మిన్నంటాయి. ఈ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ సేవల దేవదత్తు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుగుతున్నాయి. గంపలగూడెం, ఏ కొండూరు, విస్సన్నపేట,తిరువూరు మండలాల్లో టిడిపి శ్రేణులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకుంటున్నారు.