జైల్లోంచి బయటకు రాగానే నేరుగా హైదరాబాద్ కు... చంద్రబాబు కోసం ప్రత్యేక విమానం రెడీ ...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించిన నేపథ్యంతో ఆయనను హైదరాబాద్ కు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ లభించింది. దాదాపు 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైధీగా వున్న చంద్రబాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అనారోగ్య కారణాల రిత్యా చంద్రబాబు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్లు కోరారు. దీంతో ఆయనకు న్యాయస్థానం మద్యంతర బెయిల్ మంజూరు చేసింది.
జైలు నుండి విడుదలైన వెంటనే చంద్రబాబును హైదరాబాద్ కు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఆయనను తరలించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కూడా చంద్రబాబుకు వైద్యం అందించేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు కొడుకు కోడలు లోకేష్, బ్రాహ్మణి మరికొద్దిసేపట్లో రాజమండ్రి కారాగారం వద్దకు చేరుకోనున్నారు.
Read More బాబుకు మధ్యంతర బెయిల్: టీడీపీ ఆఫీస్ వద్ద శ్రేణుల సంబరాలు
చంద్రబాబు కోసం రాజమండ్రి విమానాశ్రయంలో ప్రత్యేక విమానం రెడీగా వున్నట్లు తెలుస్తోంది. బెయిల్ ప్రాసెస్ పూర్తవగానే చంద్రబాబు జైలునుండి బయటకు రానున్నారు. కుటుంబసభ్యులతో కలిసి కారులో విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి విమానంలో హైదరాబాద్ కు పయనం కానున్నట్లు టిడిపి వర్గాల సమాచారం.
స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు షరతులతో కూడిన మద్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆయన ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చని తెలిపింది. కానీ చేయించుకున్న చికిత్స, ఆస్పత్రి వివరాలు సరెండర్ సమయంలో సీల్డ్ కవర్‍లో జైలు సూపరింటెండెంట్‍కు సమర్పించాలని సూచించింది.
లక్ష రూపాయల బాండ్‍తో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదని ఆదేశించింది. తిరిగి నవంబర్ 28 సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ కావాలని చంద్రబాబుకు సూచించింది ఏపీ హైకోర్టు.