గుంటూరు: ఓవైపు యావత్ ప్రపంచం కరోనాను ఎలా అంతమొందించాలో అన్నదాని గురించి జగన్ ప్రభుత్వానికి మాత్రం అవేవీ పట్టడంలేదంటూ శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.  కరోనా నేపథ్యంలో  ప్రజలపై పన్నులు వేసిన ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఇది పన్నులు వేసే సందర్భం కాదు...ధరలు పెంచే సందర్భం అంతకన్నా కాదు ఆపన్నులను ఆదుకునే సందర్భం, బాధితులకు సహాయపడే సందర్భమన్నారు. ఒకవైపు కరోనాతో అనేకమంది అనారోగ్యం పాలవుతుంటే మరోవైపు స్వయంగా వైసిపి ప్రభుత్వమే ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతోందని యనమల ఆరోపించారు.   
 
''మద్యం ధరలు 25% పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ప్రజలపై రూ5వేల కోట్ల భారం మోపడాన్ని గర్హిస్తున్నాం. మద్యం కంపెనీల ఒత్తిళ్ల మేరకే ఇప్పుడీ ధరల పెంపు నిర్ణయం. ఇప్పటికే భారీగా ఉత్పత్తులకు మద్యం కంపెనీలకు అనుమతిచ్చారు. మద్యం కంపెనీల మేళ్ల కోసం, కమిషన్ల కోసమే ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు'' అని వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించారు.  

''ఇప్పటికే రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోంది. నాసిరకం మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. వైసిపి నాయకులే నాటుసారా తయారీ వెనుక ఉన్నారని, వాలంటీర్లతో అమ్మిస్తున్నారని మీడియాలో చూశాం. ఇప్పుడీ నిర్ణయంతో నాటుసారా తయారీ, నాసిరకం మద్యం అమ్మకాలు మరింత పేట్రేగుతాయి''అని అన్నారు. 

''ఒకవైపు దేశం అంతా లాక్ డౌన్ కొనసాగుతున్నా మన రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకాలు పేట్రేగాయి. దుకాణాల్లో మద్యం దొడ్డిదారిన తరలించి అక్రమ అమ్మకాలు జరిపారు. ఎలుకలు మద్యం తాగాయని చెప్పడం దారుణం. ఎలుకలు ఇనుము తిన్నాయని గతంలో కథల్లో విన్నాం. ఎలుకలు మద్యం తాగాయని వైసిపి పాలనలో చూస్తున్నాం'' అంటూ సెటైర్లు విసిరారు. 

''పేదల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం ఇచ్చింది సగం అయితే గుంజుకుంటోంది రెట్టింపు. గత ఏడాదిగా ఇప్పటికే ప్రజలపై భారీగా భారాలు. ఆర్టీసి ఛార్జీల పెంపు, కరెంట్ బిల్లుల పెంపు, ఇసుక ధర పెంపు.. ఇప్పుడీ మద్యం ధరల పెంపు పేదల రక్తం పిండుకోడమే. అసలే కష్టాల్లో ప్రజలు ఉంటే, వారిని ఆదుకునే చర్యలు చేపట్టకుండా మరిన్ని కష్టాల్లోకి నెట్టడం గర్హనీయం'' అని విమర్శించారు. 

''పోషకాహారం అందించి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా బైట రాష్ట్రాలు, విదేశాలు చేస్తుంటే, మన రాష్ట్రంలో పోషకాహారం ఇవ్వకపోగా మద్యం అందుబాటు పెంచడం, మద్యం ధరలు 25% అదనంగా పెంచడం హేయనీయం. దశలవారీ మద్య నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, ప్రభుత్వ మద్యం దుకాణాలు పెద్దఎత్తున తెరిచారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను దారుణంగా మోసం చేశారు. వైసిపి మోసాలకు బలైన ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. మద్యం ధరల నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలి'' అని యనమల వైసిపి సర్కార్ ను డిమాండ్ చేశారు.