విపత్కర పరిస్ధితుల్లోనూ.. అవినీతి, రాజకీయాలకే ప్రాధాన్యత: వైసీపీపై యనమల విమర్శలు
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్ని కరోనా తీవ్రతను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్ని కరోనా తీవ్రతను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా అంటే జగన్ కు మొదటి నుంచి చులకన అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే దుర్బుద్ధితోనే.. కరోనాను తీవ్ర నిర్లక్ష్యం చేశారని యనమల ధ్వజమెత్తారు. కరోనా నియంత్రణ విషయంలో ఏపీ వెనుకబడి ఉందని... పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం లేదని రామకృష్ణుడు అన్నారు.
ర్యాపిట్ కిట్లలో కూడా అవినీతికి పాల్పడే స్థితికి వచ్చారని, అవినీతికి, రాజకీయాలకే ప్రాధాన్యత తప్పితే.. కరోనా నియంత్రణ విషయంలో లేదని ఆయన విమర్శించారు. దీనిని ప్రతిఒక్కరు ఖండించాలని.. కర్ణాటక, కేరళ కరోనాను సమర్థంగా అరికడుతున్నాయని యనమల ప్రశంసించారు.
జగన్ నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల కోరనా రోజురోజుకూ పెరుగుతోందని.. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పరిస్ధితి తీవ్రంగా ఉందని యనమల రామకృష్ణుడు విచారం వ్యక్తం చేశారు.
మరోవైపు రాష్ట్ర ఆదాయం కూడా లేదు అనడానికి లేదని, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని...పెన్షన్లు, జీతాల్లో కోత విధించారని ఆయన మండిపడ్డారు. నిధులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రద్దుల విధానంలోనే జగన్ వెళుతున్నారని యనమల ఆరోపించారు.
పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని.. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద డబ్బులు ఖర్చు పెట్టడం లేదన్నారు. పంటలను కొనే పరిస్ధితిలో ప్రభుత్వం లేదని.. దీంతో రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారని, ఖరీఫ్‌కు పెట్టుబడులు పెట్టలేరని యనమల ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలను ఆదుకునేందుకు ఏ విధమైన ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించలేదని.. చివరికి కరోనా కేసులను కూడా దాచిపెడుతున్నారని రామకృష్ణుడు ఆరోపించారు. సీపీ నేతలే కరోనాను వ్యాపింపచేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.