ఏలూరు: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు ఆంధ్రప్రదేశ్ పర్యటనలతో కలకలం సృష్టిస్తున్నారు. సంక్రాంతి సంబరాలకంటూ భీమవరం వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీకి కుంపటి పెడితే, తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టారు. 

హైదరాబాదులోని కూకట్ పల్లి టీఆర్ఎస్ శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు ద్వారకా తిరుమలకు వచ్చారు. ఆయనకు స్వయంగా తెలుగుదేశం పార్టీ నేత చెలికాని సోంబాబు స్వాగతం చెప్పడం వివాదంగా మారింది,

చెలికాని సోంబాబు ఉదంతం తెలిసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాకు వచ్చి ఇక్కడ కులరాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే టీఆర్ఎస్ నేతలను కలవకూడదని తాజాగా తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఆదేశించారు.