ప్రతి శుక్రవారం జగన్ తో పాటు కోర్టుకు వస్తున్నాడనా...లేక తన అవినీతిలో పాలుపంచుకున్నందుకా.. లేక కోట్లు సంపాదించుకోవడానికి జగన్ కు సహకరించాడని శామ్యూల్ ని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తున్నారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. 

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎవరిని నియమించాలనేదానిపై వైసిపి ప్రభుత్వం గవర్నర్ కు మూడుపేర్లు ప్రతిపాదించాయని... వారిలో శామ్యూల్ అనే ఐఏఎస్ అధికారిపట్ల మొగ్గుచూపుతున్నట్లు ప్రభుత్వం సంకేతం పంపిందని పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. 

''నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైరైన తర్వాత ఎవరినైతే కోవిడ్ సమయంలో రమేశ్ కుమార్ స్థానంలో నియమించాలని తీసుకొచ్చారో, సదరు వ్యక్తి దళిత వర్గానికి చెందిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్. అతను న్యాయశాస్త్ర కోవిదుడు నిమ్మగడ్డ కంటే సమర్థుడు, దళితుడు కాబట్టే కనగరాజ్ కు అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు ఆనాడు ప్రభుత్వం చెప్పింది. అప్పుడు ఆఘమేఘాలపై కనగరాజ్ ను తీసుకొచ్చి, రాత్రికి రాత్రి రమేశ్ కుమార్ స్థానంలో నియమించారు. కోర్టు ఆదేశాలతో ఆ నియామకం కాస్త ప్రభుత్వానికి బెడిసికొట్టింది. ఇప్పుడు మార్గం సుగమమైంది కాబట్టి, నెలాఖరుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైరవుతున్నారు కాబట్టి, న్యాయశాస్త్ర కోవిదుడు, దళితుడు, శక్తియుక్తి సామర్థ్యాలున్న కనగరాజ్ ను నియమించాలి కదా? ఆయన్ని నియమించకపోగా, ఆయన పేరు గవర్నర్ కు పంపగపోగా, ఇప్పుడు కొత్త పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించడమేంటి?'' అని వర్ల ప్రశ్నించారు. 

''శామ్యూల్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అతను జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా కూడా పనిచేశారు. అంతేకాకుండా జగన్ అవినీతి కేసుల్లో శామ్యూల్ ముద్దాయిగా కూడా ఉన్నారు. వాన్ పిక్ కేసుల్లో ఏ1 జగన్మోహన్ రెడ్డి అయితే ఏ8గా శామ్యూల్ ఉన్నారు. ఆ శామ్యూల్ నే ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల కమిషనర్ గా నియమించాలని చూస్తోంది. వాన్ పిక్ తోపాటు ఇందూటెక్ జోన్ కేసులో కూడా శామ్యూల్ ఏ10గా ఉన్నారు. అటు వంటి వ్యక్తి ప్రతి శుక్రవారం కోర్టులకు హాజరవుతున్నాడు. తనతోపాటు కోర్టులకు వస్తాడని ముఖ్యమంత్రి ఆయన్ని ఎంపికచేశారా? అవినీతికేసుల్లో విచారణ ఎదుర్కొంటూ, కోర్టుల్లో నిలబడే వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల క మిషనర్ గా నియమిస్తారా?'' అని నిలదీశారు. 

read more ఏపీ పరిషత్ ఎన్నికలపై చేతులెత్తేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

''ప్రస్తుత ఎస్ఈసీ రమేశ్ కుమార్ రిటైరయ్యాక కనగరాజ్ ను కదా నియమించాలి. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేసినట్టేనా? న్యాయ కోవిదుడు, దళితుడైన కనగరాజ్ ను ఎందుకు వద్దన్నారో... ఇప్పడు ముద్దాయిని ఎందుకు కావాలనుకుంటున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ అన్ని విధాలా అర్హుడని వైసీపీ నేత అంబటి రాంబాబు గతంలో చెప్పిందంతా హంబట్టేనా? కనగరాజ్ ను తోసిరాజని, తోటి ముద్దాయిని జగన్ కోర్టులో జీహుజూర్ అని నిలబడే శామ్యూల్ ను తెచ్చుకోవడమేంటి? ప్రతి శుక్రవారం జగన్ తోపాటు కోర్టుకు వస్తున్నాడనా...లేక తన అవినీతిలో శామ్యూల్ పాలుపంచుకున్నందుకా.. లేక కోట్లు సంపాదించుకోవడానికి జగన్ కు సహకరించాడని ఆయన్ని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తున్నారా? శామ్యూల్ కు ఉన్న అర్హతలేమిటో ముఖ్య మంత్రి సమాధానం చెప్పాలి'' అని అడిగారు. 

''అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రితో అంటకాగిన వ్యక్తి చట్టప్రకారం, రాజ్యాంగం ప్రకారం నడుస్తాడా? శామ్యూల్ ముఖ్యమంత్రి గీసిన గీత దాటుతాడా? అటువంటి వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని చూడటం ఎంతవరకు సబబు? గవర్న ర్ కి తెలుగుదేశం పార్టీ అనేక విజ్ఞప్తులు చేసింది. ఆయన కూడా న్యాయశాస్త్ర కోవిదుడని విన్నాము. శామ్యూల్ వంటి వారిని వ్యవస్థలకు అధిపతిని చేస్తే, సామాన్యులకు ఏం లాభం కలుగుతుందో గవర్నర్ కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఏ1గా ఉన్న కేసుల్లోఏ8, ఏ10గా ఉన్న ముద్దాయి ఎన్నికల కమిషనర్ గా ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నిస్తున్నాను. గవర్నర్ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆయన్ని హెచ్చరిస్తున్నాము. తప్పు చేయవద్దని, న్యాయానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని గవర్నర్ ని తెలుగుదేశం పార్టీ తరుపున హెచ్చరిస్తున్నాము. గవర్నర్ వెంటనే కళ్లు తెరిచి, ప్రభుత్వ ప్రతిపాదనపై ఆలోచించాలని కోరుతున్నాము'' అని వర్ల పేర్కొన్నారు. 

''తోటి ముద్దాయిలంతా తనచుట్టూ ఉండాలని కోరుకోవడం ముఖ్యమంత్రికి ఉన్న చెడ్డ అలవాటు. వై.ఎస్ హాయాంలో గనులశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన శ్రీమతి శ్రీలక్ష్మి ముఖ్యమంత్రితోపాటు కోర్టుకు హాజరవుతున్నారు. ఆమె గురించి ముఖ్యమంత్రి ఎంత తాపత్రయపడ్డారండీ? ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి రప్పించడంకోసం ఈ ముఖ్యమంత్రి ప్రధానిముందే సాగిలబడ్డాడు. ప్రధానితో ఏం చెప్పి, ముఖ్యమంత్రి శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకొచ్చాడో వైసీపీ నేతలెవరైనా చెప్పగలరా? పోలవరం, అమరావతి, ప్రత్యేకహోదా సహా వేటిగురించీ ప్రధానమంత్రిని అడగని ముఖ్యమంత్రి శ్రీలక్ష్మిని తన రాష్ట్రానికి రప్పించుకోవడానికి నానాపాట్లు పడ్డాడు. తోటిముద్దాయి అనే కదా ముఖ్యమంత్రికి ఆమెపై అంతటి ఆపేక్ష'' అని ఎద్దేవా చేశారు. 

''బీపీ.ఆచార్య, శామ్యూల్, వీ.డీ.రాజగోపాల్, మన్మోహన్ సింగ్, కృపానందం, రత్నప్రభ వంటి ఐఏఎస్ అధికారులంతా జగన్మోహన్ రెడ్డి అవినీతికి బలైపోయినవారు కాదా? వారంతా ఎక్కడైనా తనకు ఎదురుపడితే సిగ్గుతో తలదించుకుంటారు. జగన్ అవినీతి ఉబలాటానికి వారంతా బలిపశువులు అయ్యింది నిజంకాదా? అధికారులు పరంగా వారంతా ఉంటే, రాజకీయంగా విజయసాయి రెడ్డి మొదలు సజ్జల దివాకర్ రెడ్డి (సజ్జలరామకృష్ణారెడ్డి సోదరుడు). వై.వీ.సుబ్బారెడ్డి వంటి అనేకమంది ఉన్నా రు. జగన్ తన ఉబలాటాన్ని నిలువరించుకొని, రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించాలి. కనగరాజ్ కు అన్యాయం చేయడం, యావత్ దళిత జాతికి అన్యాయం చేయడమేనని ముఖ్యమంత్రి గ్రహించాలి. ఆనాడు కనగరాజ్ ను చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడని మొసలికన్నీరు కార్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమో తోటి ముద్దాయిని కనగరాజ్ కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడానికి ప్రయత్నించడమేంటి? ప్రజలుకూడా ముఖ్యమంత్రి వ్యవహారశైలి గురించి ఆలోచన చేయకపోతే ఎలా?'' అని వర్ల రామయ్య సూచించారు.