Asianet News TeluguAsianet News Telugu

సజ్జల ఆదేశాలతోనే...దేవాలయాల దాడులపై డిజిపి వ్యాఖ్యలు: వర్ల రామయ్య

13వ తేదీన మాట్లాడిన డీజీపీ ఏపార్టీకి సంబంధంలేదని చెప్పి, 15వతేదీన మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు సంబంధించినవారి ప్రమేయం ఉందని చెప్పడం సిగ్గుచేటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు.

 

 

tdp leader varla ramaiah reacts on dgp comments
Author
Vijayawada, First Published Jan 16, 2021, 4:37 PM IST

విజయవాడ: హైందవమతంపై దాడులకు సంబంధించిన దోషులను అరెస్ట్ చేసినట్లు చెప్పిన డీజీపీ, పార్టీల ప్రమేయం ఉందని చెప్పడం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. డీజీపీ ఏ సమాచారంతో మాట్లాడారు? సీఐడీ, సిట్ సంస్థలు ఇచ్చిన సమాచారంతోనా లేక సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారంతో మాట్లాడారా? అంటూ ఎద్దేవా చేశారు.

''13వ తేదీన మాట్లాడిన డీజీపీ ఏపార్టీకి సంబంధంలేదని చెప్పి, 15వతేదీన మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు సంబంధించినవారి ప్రమేయం ఉందని చెప్పడం సిగ్గుచేటు. ఏ డీజీపీ కూడా ఇంతలా అధికారపార్టికి వత్తాసు పలుకుతూ దిగజారి మాట్లాడారు. హిందూమతంపై జరిగిన దాడుల ఘటనలను సోషల్ మీడియాలో ప్రచారం చేసినవారిని, గుప్త నిధులకోసం తవ్వకాలు జరిపినవారిని అరెస్ట్ చేసిన డీజీపీ, వారే హిందూ మతద్రోహులన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నాలుచేయడం ఆయనస్థాయికి తగిన పనికాదు'' అని మండిపడ్డారు.

''ఆంజనేయస్వామి విగ్రహం చేతిని విరగ్గొట్టినవారు, రథాలు తగలబెట్టినవారు, రామతీర్థంలో రాముని తల పగలగొట్టినవారి సంగతేమిటో డీజీపీ చెప్పాలి.  హైందవమతాన్ని కించపరుస్తూ, ఆంజనేయస్వామి విగ్రహంచేయి విరిగితే ఏమవుతుంది... రాముడి తల తెగితే రక్తమొస్తుందా అంటూ అవహేళనగా మాట్లాడిన బూతుల మంత్రి కొడాలి నానీ డీజీపీకి నేరస్తుడిలా కనిపించలేదా? కర్నూలు జిల్లాలోని ఓంకారక్షేత్రంలో  అర్చకులను చర్నాకోలుతో చావబాదిన ప్రతాపరెడ్డిని డీజీపీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆంజేయస్వామి దేవాలయాన్ని జేసీబీతో కూల్చేసిన దామోదర్ రెడ్డి, డీజీపీ ప్రకటించిన హిందూద్రోహుల జాబితాలో ఎందుకు లేడు?'' అని ప్రశ్నించారు.

''వైసీపీవారిని వదిలేసి, దోషులను పట్టుకున్నామని, రాజకీయపార్టీలప్రమేయం ఉందని డీజీపీ ఎలా చెబుతారు? వైసీపీ నేతలంతా డీజీపీకి  కడిగిన ముత్యాల్లా కనిపిస్తున్నారా? 
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి తనకు తానే హిందూ దేవాలయాలపై దాడి చేశానని, విగ్రహాలను ధ్వంసం చేశానని, 699గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానని చెబితే డీజీపీ అతన్ని ఎందుకు మీడియాముందు ప్రవేశపెట్టలేదు? తాను చేసిన హిందుమత వ్యతిరేక చర్యలను తననోటితోనే ఒప్పుకున్న ప్రవీణ్ చక్రవర్తి ఎవరు...? అతనికి సహకరిస్తున్న వారెవరు..? అతనికి అధికారపార్టీ నేతలకు ఉన్న సంబంధమేమిటి..? అనే దిశగా విచారణ జరపాలన్న ఆలోచన సవాంగ్ కు ఎందుకు రాలేదు'' అంటూ నిలదీశారు.

''డీజీపీ వ్యాఖ్యలను, ఆయన విధినిర్వహణ తీరుని ఐపీఎస్ అధికారుల సంఘం కూడా సమర్థించదు.  ఒకవేళ అలా సమర్థించినట్టయితే, డీజీపీని ఉద్దేశించి ఇకపై నేను మాట్లాడను. డీజీపీ రెండురోజుల వ్యవధిలో మీడియాతో మాట్లాడిన మాటలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చినవే. ఏపీ పోలీస్ మాన్యువల్ ని, చట్టాన్ని కాదని, డీజీపీ సవాంగ్ ముఖ్యమంత్రి రుణం తీర్చుకోవడానికి ఎందుకింతలా తహతహలాడుతున్నారో  తెలియడం లేదు'' అని వర్ల రామయ్య మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios