నమ్మించి మోసం చేయడం, నట్టేట ముంచటం జగన్ రెడ్డి నైజమన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. శనివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్వకార్యం కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం జగన్ సొంతమని... తాను అధికారాన్ని చేపట్టడమే అజెండాగా ఆయన అబద్ధాలాడారని విమర్శించారు.

ప్రతి ఒక్కరిని వాడుకున్నారని.. అడ్డొస్తే బెదిరించారని, అంతమొందించారని... తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి తన ఊసరవెల్లితనం, అసలు రంగు బయటపెడుతున్నారని వర్ల అన్నారు.

నాడు ఆయన అధికారంలోకి రావడానికి సాయశక్తులొడ్డి అండగా నిలిచిన వారందరినీ నేడు ఒక్కొక్కరిగా పొమ్మనలేక పొగ పెడుతున్నారని రామయ్య ఎద్దేవా చేశారు. కొంగకు పాత్రలో నీళ్లు పోసి తాగమన్నట్లుగా అధికారాలు ఇచ్చినట్టే  ఇచ్చి వెనక్కి తీసేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

నాడు జగన్ దోచుకున్న రూ. 40 వేల కోట్ల కుంభకోణం కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని అవమానకరంగా తొలగించారని.. నేడు అజయ్ కల్లం, రమేశ్ కుమార్‌ల అధికారాలను తగ్గించారని వర్ల రామయ్య ఆరోపించారు.

జగన్ తుగ్లక్ పాలనకు ఒక వైపు ప్రజలు, మరోవైపు స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నందుకు సలహాదారులు ఛీత్కరించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు నియామకాలు ఇవ్వకుండా కక్షసాధింపులు చేపట్టారు. అధికారులను అడుగడుగునా, అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలోనూ జగన్ ధనదాహానికి అమాయకులైన ఐఏఎస్ అధికారులు, పారిశ్రామిక వేత్తలు జైలుపాలయ్యారు. నేడు కూడా తనను ఎదిరించినందుకు డాక్టర్ సుధాకర్, ఎంపీడీవో సరళా , డాక్టర్ అనితారెడ్డిలను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో ప్రజలందరూ చూశారని వర్ల రామయ్య దుయ్యబట్టారు.

పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని.. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు.