విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గవర్నర్ ఫిర్యాదు చేశారు. ఈమెయిల్ ద్వారా తన ఫిర్యాదును గవర్నర్ కు పంపించారు. కోవిడ్ కారణంగా గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకడం లేదని, ఈ మెయిల్ ద్వారా పంపించాలని చెప్పారని, అందుకే ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు.  

పల్నాడు ప్రాంతంలో దళితులను గ్రామాల నుంచి తరిమివేయడం దగ్గరి నుంచి దళిత అమ్మాయి ఇంటిని తగులెట్టిన ఘటన వరకు ఫిర్యాదులో పొందుపరిచినట్లు వర్ల రామయ్య చెప్పారు. సుధాకర్, అనితా రాణి వంటి దళిత డాక్టర్లపై వైధింపులను, వాటిని ప్రశ్నించిన దళితుల నాయకులను అరెస్టు చేయడం వంటి ఘటనలను కూడా గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు ఆయన చెప్పారు. 

ఎన్నడూ లేని విధంగా దళితులకు శిరోముండనం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయని, సామూహిక అత్యాచారాలుజరుగుతున్నాయని, హత్యలు జరుగుతున్నాయని, వాటిని అన్నింటిని ఫిర్యాదులో పొందుపరిచామని ఆయన అన్నారు. కొన్ని సంఘటనలను పరిశీలిస్తే కొంత మంది పోలీసులు అధికారి పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. 

ఆ సంఘటనలపై సమగ్రంగా సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆయన గవర్నర్ ను కోరారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఈ స్థితిలో గవర్నర్ పూనుకుని దళితులకు రాజ్యాంగబద్దంగా సంక్రమించిన హక్కులను కాపాడాలని ఆయన కోరారు.