అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో చివరి విడత పంచాయితీల్లో పోలింగ్ ముగింపుతో ఎన్నికల ప్రక్రియ సమాప్తమయ్యింది. ఈ ఎన్నికల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పందిస్తూ... అరాచకపాలన అనే నరకాసురుడిని సంహరించడానికి నాందిపలకడం ద్వారా రాష్ట్రప్రజలకు ముందే దీపావళి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి నేత్రుత్వంలోని వ్యవస్థలు సజావుగా, రాజ్యాంగబద్ధంగా పనిచేసి ఉంటే ఈ ఎన్నికలు టీడీపీకి ఏకపక్షమయ్యేవన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో డీజీపీ, ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషనర్ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. 

''వెలుగు ఉన్నంతవరకు టీడీపీకి మెజారిటీ వస్తుంది. చీకట్లో రాక్షసులకు బలం పెరుగుతుంది. రాత్రి అయ్యేకొద్దీ వైసీపీకి వచ్చేస్థానాలు పెరుగుతున్నాయి. టీడీపీవారు గెలిస్తే, రీకౌంటింగ్ పెడతారు.. వైసీపీవారు గెలిస్తే, టీడీపీవారు కోరినా రీకౌంటింగ్ జరపరు. ఒక్కసారి, ఒక్కసారి అన్నందుకు ఎటువంటి పాలన ప్రజలకు అందించారో తెలుసుకోండి'' అని ప్రజలకు సూచించారు వర్ల రామయ్య.

read more  పంచాయతీ: వైఎస్ జగన్ ఇలాకా పులివెందులలో వైసీపీ క్లీన్ స్వీప్

''చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ కావడం కాదు, తమ నాయకుడి భాగోతం రెండేళ్లకే ప్రజలకు అర్థమైందని సజ్జల గ్రహిస్తే మంచిది. అరాచకత్వంతో, అన్యాయంగా వైసీపీ గెలిచినా, నైతికంగా ప్రజల మనస్సులు గెలిచింది టీడీపీనే. అధర్మయుద్ధం సాగిస్తున్న రాక్షసులపై, రావణసైన్యంపై, కౌరవసైన్యంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీనే గెలిచింది'' అని పేర్కొన్నారు. 

''మొక్కవోని దీక్షతో, అచంచల విశ్వాసంతో పోరాటంచేసిన టీడీపీవారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. టీడీపీ వారికి అన్యాయం జరిగితే ఎంతవరకైనా వెళ్లడానికి టీడీపీ కేంద్ర నాయకత్వం సిద్ధంగా ఉంది. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే స్పూర్తితో, పట్టుదలతో టీడీపీశ్రేణులు పనిచేయాలి'' అని వర్ల సూచించారు.