తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఏపీ టీడీపీ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్ళి రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వకుండా కేసీఆర్ రావటం బాధాకరమన్నారు. అంతేకాదు ఢిల్లీలో ఏం జరిగిందో ముఖ్యమంత్రి కేసీఆర్‌కే తెలియాలని ఆయన చెప్పారు. 

అంతేకాదు రైతు ఉద్యమాన్ని కేంద్ర పెద్దలు అవహేళన చేయటం బాధాకరమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు రైతు సమస్యలు పట్టడంలేదని విమర్శించారు. 

ఇక కేసీఆర్ ఢిల్లీ ప్రయాణం వెనక ఏం జరిగిందో ఆయనే చెప్పాలని అంటూ ఇందిరా గాంధీ హయాంలో బలమైన నాయకులు ఢిల్లీ వెళ్తే బలహీనంగా మారిపోయేవారని గుర్తుచేశారు. 

మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలతో కౌలు రైతులే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. రైతు చట్టాలపై కేంద్రం చెప్పే దానిలో ఒక్క శాతం కూడా నిజం లేదన్నారు. రైతులను సంప్రదించాకనే చట్టాలు తీసుకొచ్చామని కేంద్రమంత్రులు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. 

అంబానీ, అదానీల కోసమే కొత్త రైతు చట్టాలు అని ఆరోపించారు. రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. మోదీ కంటే.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే  మేలుగా వ్యవహరించిందని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పుకొచ్చారు.