ఇటీవల సినీ నటుడు నాగార్జున.. వైసీపీ అధినేత జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే.
ఇటీవల సినీ నటుడు నాగార్జున.. వైసీపీ అధినేత జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. దీంతో.. నాగార్జున..వైసీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. తాను కేవలం మర్యాద పూర్వకంగా కలిసానని నాగ్ చెప్పినప్పటికీ.. ఈ పుకార్లు మాత్రం ఆగలేదు. కాగా.. దీనిపై టీడీపీ నేత రఘురామ కృష్ణం రాజు మాట్లాడారు.
తనకు హీరో నాగార్జున మంచి ఫ్రెండ్ అని చెప్పారు. నాగార్జున మేనల్లుడు సుమంత్.. జగన్ కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ చొరవతోనే నాగార్జున జగన్ ని కలిసారని కృష్ణంరాజు తెలిపారు. అంతేకాకుండా.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించారు.
ఇతర పార్టీ నేతలతో మాట్లాడినంత మాత్రాన తాను పార్టీ మారినట్లు కాదన్నారు. వివాహ వేడుకల్లో అన్ని పార్టీల నేతలతో తాను పిచ్చాపాటిగా మాట్లాడుతుంటానని చెప్పారు. దాంట్లో రాజకీయం ఏమీ లేదన్నారు. తన సీటు గురించి సర్వే చేస్తున్నట్లు వస్తున్న వార్తలు కూడా అవాస్తవం అని తెలిపారు. తనకు ప్రశాంత్ కిశోర్ కూడా మంచి స్నేహితుడేనని అన్నారు.
