తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వానికి టీడీపీ నేత సుగవాసి ప్రసాద్ బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టీటీడీ ఈవోకు రాజీనామా లేఖ సమర్పించారు. గత ప్రభుత్వం తమకు ఈ పదవికి అప్పగించిందని... ఇంతవరకు సహకరించిన వారందరికీ దన్యావాదాలు తెలిపారు. 

2019 ఎన్నికల్లో రాయచోటి అసెంబ్లీ స్థానానికి టీడీపీ టిక్కెట్‌ కోసం మాజీ ఎంపీ, ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కుమారుడు ప్రసాద్‌బాబు తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే మాజీ ఎమ్మెల్యే రమే‌ష్‌కుమార్‌రెడ్డికి పార్టీ టిక్కెట్‌ ఇచ్చి ప్రసాద్‌బాబును టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించింది. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడంతో, ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అన్ని దేవస్థానాల పాలక మండళ్లను రద్దు చేస్తుందన్న నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.