గన్నవరం సబ్ జైలుకు పట్టాభి తరలింపు
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు పట్టాభిని సబ్ జైలుకు తరలించారు.
గన్నవరం: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను సబ్ జైలుకు తరలించాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి బుధవారం నాడు ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు.
బుధవారం నాడు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హజరుపర్చారు. జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను కూడ పోలీసులు జడ్జికి అందించారు. ఈ రిపోర్టును పరిశీలించిన తర్వాత పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు కాకుండా వేరే జైలుకు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల వినతిని న్యాయమూర్తి తిరస్కరించారు.. వచ్చే నెల 14వ తేదీ వరకు పట్టాభికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాలతో పట్టాభిని పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు.
also read:గన్నవరంలో టీడీపీ, వంశీ వర్గీయుల ఘర్షణ: కోర్టులో పట్టాభిని హజరుపర్చిన పోలీసులు
గన్నవరం ఘటనపై పట్టాభి సహ 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభి వ్యాఖ్యల వల్లే గన్నవరంలో గొడవలు జరిగాయని జిల్లా ఎస్పీ జాషువా ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం నాడు సాయంత్రం గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.
పార్టీ కార్యాలయ ఆవరణలో గల కారుకు నిప్పంటించారు. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలొ గన్నవరం సీఐ తలకు గాయాలయ్యాయి. టీడీపీ నేత చిన్నా కారుకు కూడా వంశీ వర్గీయులు నిప్పంటించారు. ఈ దాడులను నిరసిస్తూ విజయవాడ- హైద్రాబాద్ జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. ఈ రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో కు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు.