వైసీపీ నేతల తీరు చూసి కరోనా కూడా భయపడిందంటూ టీడీపీ శాసన మండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు ఎద్దేవా చేశారు. తనకు వైసీపీ వైరస్ తాకిందేమోనని కరోనా భయపడినట్లు వుంది. నాలుకకు నరంలేదన్న విధానం వైసీపీ నేతలను చూస్తే తెలుస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీ మంత్రులంతా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారా? నాడు ఎన్నికల పెట్టాలని నేడు ఎందుకు వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

అందుకే నాడు – నేడు వైసీపీ నేతలు స్థానిక ఎన్నికలపై మాట మార్చిన జాబితాను విడుదల చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. మాట తప్పం మడమ తిప్పం అంటూ కరోనాపై నవవంకరులు తిరిగిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే. ప్రజాస్వామ్యం అన్న పదానికి అర్ధం లేకుండా చేశారు. కరోనాను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న ఏకైక పార్టీగా వైకాపా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

నాడు-నేడు కింద మీరు తెచ్చిన మాటల మార్చే పథకాన్ని ప్రజలంతా చూస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి సచివాలయ వ్యవస్థ ద్వారా కరోనాను నివారిస్తామన్న మాట మర్చిపోయారా? కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడం పెద్ద కుట్ర అని చిలుక పలుకులు పలికింది మీరు కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు మాట తీరుతో పగటివేషగాళ్ళు కూడా భయపడుతున్నారు. కరోనా సాకు చూపి విచ్చలవిడిగా దోచుకున్నారు. అంతే కాకుండా రాజకీయాలకు కూడా వాడుకుంటున్నారు. ప్రపంచంలో వైసీపీ వాడుకున్నంతగా ఎవరూ వాడుకోలేదని దుయ్యబట్టారు.

వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తోంది. అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొన్నట్లే ఎన్నికల వ్యవస్థను కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ఇష్టాను రీతిలో ఎన్నికలు నిర్వహించుకోవాలన్న దురుద్దేశంతోనే సంస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎన్నికల చట్టాలను కాలరాయడమే. న్యాయస్థానాల ఆదేశాలను కూడా సీఎం జగన్ రెడ్డి అమలు చేయడం లేదన్నారు. 

స్వతహాగా ఎన్నికల సంఘ విధులు కూడా నిర్వర్తించనీయడంలేదు. అమెరికాలో ట్రంప్ తరహాలోనే ఆంధ్రాలో జగన్ రెడ్డి వ్యవహారం ఉంది. అమెరికా రాజ్యాంగానికి విరుద్దంగా ట్రంప్ వ్యవహరిస్తున్నట్లే జగన్ రెడ్డి కూడా భారత రాజ్యాంగానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యాడని ప్రపంచం అంతా ఆమోదిస్తే, నేను మాత్రం కుర్చీ దిగనన్న ట్రంప్ శైలిలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉందని అన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని చెప్పే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుంది.? జగన్మోహన్ రెడ్డికి తన పరిపాలనపై తనకే నమ్మకం లేదు. అందుకే తన పనితీరుపట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రజలు గుణపాటం చెబుతారనే ఎన్నికలు జరపకుండా కరోనా సాకు చూపుతున్నారని చెప్పుకొచ్చారు. 

ఎన్నికలు సక్రమంగా, నిజాయితీగా జరిగితే తమ ఆటలు సాగవని, మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం అసాధ్యమనే ఆందోళనతో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొండికేస్తుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు హుందాతనం కోల్పోతే ఇక రాజ్యాంగం ఎందుకు? ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు? గతంలో సీఎం నేనా? రమేష్ కుమారా? అన్న జగన్.. ఎన్నికల కమిషన్ రమేష్ కుమారా?..జగనా? అన్న ప్రశ్న ఎందుకు వేసుకోలేదు? అంటూ సూటి ప్రశ్న వేశారు.

మాస్కులేకుండా విచ్చల విడిగా విహారయాత్రలు చేసిన మీకు కరోనా పట్ల జాగ్రత్త అంటే ఆశ్చర్యం వేస్తోంది. కరోనా వస్తుంది, పోతుంది.. ఇదొక నిరంతర ప్రక్రియ అని చెప్పింది మీరు కాదా? దానికి బ్లీచింగ్, ప్యారా సెట్మాల్ సరిపోతుందని చెప్పిన మీరే నేడు కరోనాతో జాగ్రత్తగా ఉండాలని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజారెడ్డి రాజ్యాంగంతో రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తే పశ్చాత్తాపం చెందే రోజు తొందర్లోనే ఉందని హెచ్చరించారు.