జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ప్రతిపక్షాలు జాగ్రత్తపడితే అధికార వైసిపికి డిపాజిట్లు కూడా దక్కవని మాజీ మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. 

అమరావతి: జగన్ సర్కార్ ను గద్దెదించడానికి వైసిపి (ycp) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానంటూ జనసేన (janasena) పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ (pawan kalyan) చేసిన వ్యాఖ్యలు మెల్లిగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువస్తోంది. తాజాగా మాజీ హోంమంత్రి, టిడిపి సీసియర్ నాయకులు నిమ్మకాయల చినరాజప్ప (nimmakayala chinarajappa) పవన్ వ్యాఖ్యలను సమర్థించారు. ప్రతిపక్షాలు ఏకమై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని మాజీ హోంమంత్రి పేర్కొన్నారు.

వైఎస్ జగన్‍ (ys jagan) అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వైసిపిని ఓడించాలని కోరుకుంటున్నారని... అదే పవన్ కల్యాణ్ చెప్పారని చినరాజప్ప గుర్తుచేసారు. పవన్ చెప్పినట్లుగా ప్రజలను ప్రభుత్వ హింస నుంచి గట్టెక్కించాలంటే ప్రతిపక్షాలు ఏకంకావాల్సిన అవసరం వుందన్నారు. అయితే టిడిపి పొత్తుల విషయం అధిష్ఠానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని మాజీ హోంమంత్రి తెలిపారు. 

ఇదిలావుంటే జనసేన ఆవిర్భావ (janasena formation day) సభలో పవన్ కల్యాణ్ పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని పవన్ సంకేతాలిచ్చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్ధితుల్లో చీలనివ్వమని.. ఇందుకోసం బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామందని పేర్కొన్నారు. బిజెపితో పాటు ఇతర కలిసివచ్చే పార్టీలో పొత్తులకు సిద్దంగా వున్నట్లు పవన్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. 

గతంలో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా జనసేనతో పొత్తు గురించి స్పందించారు. గతంలో మాదిరిగా జనసేన పార్టీలో పొత్తు పెట్టుకోవాలని ఓ టిడిపి నాయకుడి ప్రశ్నకు జవాబిస్తూ లవ్ అనేది రెండు వైపులా ఉండాలని... వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు కూడా పవన్ తో పొత్తుకు సిద్దంగానే వున్నట్లు ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. తాజాగా పవన్ నుండి కూడా వైసిపిని గద్దేదించడానికి ఇతర పార్టీలతో సిద్దమని చెప్పకనే చెప్పారు. ఇలా పవన్ నుండి కూడా లవ్ ప్రపోజల్ వచ్చినట్లే కాబట్టి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత బిజెపి, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని టిడిపి అధికారంలోకి వచ్చింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేయడంతో వైసిపి అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి కలిసి పనిచేసేందుకు ఈ మూడు పార్టీలు సిద్దమవుతున్నట్లు తాజా రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పటికే బిజెపి, జనసేన కలిసే వుండగా వీరితో టిడిపి కూడా జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.