గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని... వారు చెమటోడ్చి పండించిన పంటను దళారులు దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. దళారుల దోపిడీని ఆవేదనతో వివరిస్తున్న నెల్లూరుకు చెందిన ఓ రైతు వీడియోను జతచేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. 

 ''నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతుల్ని దళారులు నిలువు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మద్దతు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పుట్టి ధాన్యానికి రూ.8వేలు ధర కూడా లభించడం లేదు'' అని లోకేష్ పేర్కొన్నారు. 

 

''పుట్టి ధాన్యానికి రూ.16వేల కనీస మద్దతు ధర కల్పించాలి. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని జగన్ రెడ్డి గారు చెప్తున్న గాలిమాటలు తప్ప,  క్షేత్ర స్థాయిలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం'' అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికన ప్రభుత్వంపై మండిపడ్డారు.