కడప: ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో తెలుగుదేశం నేత నందం సుబ్బయ్య దారుణ హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ హత్య వెనక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, ఆయన బావమరిది ఉన్నారని టిడిపి ఆరోపిస్తోంది. వారిని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికన డిమాండ్ చేశారు.

''ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణిచేస్తాం వైఎస్ జగన్. ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు. నీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. చేనేత‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని అత్యంత కిరాతకంగా హత్యచేసారు'' అంటూ లోకేష్ హెచ్చరించారు
 
''మీ అవినీతిని ఎండగట్టినందుకు కక్షగట్టి  టిడిపి జిల్లా అధికార‌ప్ర‌తినిధి నందం సుబ్బయ్యను ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారు. హత్య చేసిన ఎమ్మెల్యే,అతని బావమరిది బంగారురెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలి. వేట‌కొడ‌వ‌ళ్ల‌తో తండ్రిని న‌రికేయించావు. నువ్విచ్చే ప‌రిహారంతో అనాథ‌లైన ఆ పిల్ల‌ల‌కు తండ్రిని తేగ‌ల‌వా? జ‌గ‌న్‌రెడ్డీ!'' అంటూ ట్విట్టర్ వేదినక ఆవేదన వ్యక్తం చేశారు. 

read more ఎమ్మెల్యే హస్తం.. ఎక్కడికైనా వస్తా న్యాయం చేయండి: సుబ్బయ్య భార్య

''ప్రొద్దుటూరులో తెలుగుదేశం నేత, జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న కక్షతో ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిని దారుణంగా బలితీసున్నారు. హత్యలు చేయడం వీరత్వం అనుకుంటున్నారా?'' అని లోకేష్ ప్రశ్నించారు. 
 
''పాలన అంటే రోజుకో హత్య, పూటకో రేప్ అన్నట్టుగా తయారైంది. ఇది పోలీసుల వైఫల్యం కాదా? వైసీపీ ఎమ్మెల్యే, అతని బావమరిది చేస్తోన్న అక్రమాలను బయటపెట్టిన సుబ్బయ్య హత్య వెనుక వాళ్ళిద్దరూ ఉన్నారన్నది స్పష్టమవుతోంది. పోలీసులు వెంటనే సుబ్బయ్య హంతకులపై చర్యలు తీసుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.