కడప జిల్లాలో తెలుగుదేశం నేత నందం సుబ్బయ్య హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. తన భర్త హత్య వెనక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, ఆయన బావమరిది ఉన్నారని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపిస్తున్నారు.

మంగళవారం ఉదయం నుంచి కొంత మంది వారి ఇంటి చుట్టూ తిరిగారని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని.. ఈ విషయంపై ఎక్కడికైనా వచ్చి మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు అపరాజిత తెలిపారు.

మరోవైపు సుబ్బయ్య హత్య కేసులో తన పేరు వినిపిస్తుండటంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీనిని ఆయన ఖండించారు. కుందా రవి సహా మరో నలుగురు వ్యక్తులు తన భర్తను హతమార్చారని సుబ్బయ్య భార్య చెప్పిందన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

అత్యాచార యత్నం కేసులో సుబ్బయ్యకు ఆరేళ్లు శిక్ష పడిందని.. ప్రస్తుతం జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకుని బయట తిరుగుతున్నాడని రాచమల్లు తెలిపారు. అతను 14 కేసుల్లో నేర చరిత్ర వున్న ముద్దాయి అని, ఈ మధ్య దొంగ సారా కేసులో కూడా పట్టుబడ్డాడని ఎమ్మెల్యే వెల్లడించారు.

Also Read:సుబ్బయ్య హత్య.. ఏం జరిగిందో కమీషనర్ చెప్పాలి: చంద్రబాబు డిమాండ్

ఇన్ని కేసుల్లో ఎంతోమంది శత్రువులుంటారని, వారిలో ఎవరో చంపి వుంటారని శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కాగా, ఈ కేసులో లొంగిపోయిన నలుగురు నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే.

సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద ఆయనను దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య తల ఛిద్రమైంది.