జగన్ ఏడాది పాలనంతా నవ స్కామ్‌లు, నవ అబద్ధాలు, నవ విధ్వంసాలు, నవ రాజ్యాంగ ధిక్కరణలు, నవ మానవ హక్కుల ఉల్లంఘనలు, నవ మళ్లీంపులేనన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. సోమవారం జగన్ ఏడాది పాలనపై ‘‘ విధ్వంసానికి ఒక్క ఛాన్స్’’ పేరుతో టీడీపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయ నాయకులు వివిధ పథకాలను తీసుకొస్తారని.. కానీ ముఖ్యమంత్రి జగన్ కాస్త డిఫరెంట్ అంటూ ఆయన సెటైర్లు వేశారు. కేవలం స్కామ్‌లు చేసేందుకే  జగన్ స్కీమ్‌లు తీసుకొస్తున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు.

గడిచిన ఏడాదిగా జరిగిన కుంభకోణాల గురించి చర్చించాలంటే ఇంకో సంవత్సరం కావాలని ఆయన అన్నారు. రోడ్డుపై పేద  ప్రజలు ఏడుస్తుంటే... జగన్ రెడ్డి తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్‌లో సంబరాలు చేసుకుంటున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.

ఇలాంటి పరిపాలన తాము ఎప్పుడు చూడలేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలే అంటున్నారని ఆయన దుయ్యబట్టారు. సారా అమ్మకాల గురించి స్వయంగా స్పీకర్ సైతం ఆవేదన వ్యక్తం చేశారని లోకేశ్ గుర్తుచేశారు. గడిచిన ఒక్క సంవత్సరంలో 564 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. రైతులకు కనీసం విత్తనాలు , ఎరువులు ఇచ్చే పరిస్ధితి లేదని ఆయన ఆరోపించారు.

Aslo Read:వైసిపి నేతల బ్రాండ్ బాజా... మీ సమాధానమేంటి జగన్ గారు: నిలదీసిన దేవినేని ఉమ

రైతు భరోసా.. రైతు దగా కింద మారిందన్న లోకేశ్.. ఏపీ ప్రభుత్వం కింద రూ. 13,500, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మరో రూ.6 వేలు కలిపి 19,500 రైతులకు ఇవ్వాలన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం కింద రూ.7,000 , కేంద్ర ప్రభుత్వం కింద రూ.6000 కలిపి రూ.13,000 మాత్రమే ఇస్తున్నారని ఆయన అన్నారు. 

అవ్వాతాతలకు రూ.1000 పెన్షన్ ఇస్తామన్న జగన్ కేవలం రూ.250 మాత్రమే పెంచారని లోకశ్ మండిపడ్డారు. పెన్షన్  గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపే పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం గురించి ఎన్నో చెప్పిన ముఖ్యమంత్రి.. చివరికి జగన్ రెడ్డి మద్యం దుకాణాల పరిస్ధితిని తీసుకొచ్చారని లోకేశ్ మండిపడ్డారు.

చీప్ లిక్కర్‌కు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారని, విషం కన్నా ఘోరమైన మద్యాన్ని పేద ప్రజలకు సరఫరా చేస్తున్నారని ఆయన విమర్శించారు. మద్యం స్కాం వల్ల దాదాపు రూ.25,000 కోట్ల రూపాయల జే ట్యాక్స్  ఇవాళ ప్రజలపై పడుతుందని ఆయన మండిపడ్డారు.

Also Read:జగన్ పాలన అద్భుతం, చంద్రబాబుతో ఏపీకి నష్టం: టిడిపి ఎమ్మెల్యే సంచలనం

అమ్మఒడిని అర్థ ఒడిగా మార్చారని..     ఈ పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పోరేషన్ నిధులను మళ్లీంచారని లోకేశ్ ఆరోపించారు. ఉచిత ఇసుక విధానంలో చౌకగా రూ. 1,500 ఉన్న ట్రాక్టర్ ఇసుక... రూ.10,000కు చేరిందని.. ఒకప్పుడు రూ.10,000లకు దొరికే లారీ ఇసుకను రూ. 50 వేలకు విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వ ధన దాహం వల్ల ఇప్పటికే 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని... 40 లక్షల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్ధితులు వచ్చాయని లోకేశ్ ఆవేదన  వ్యక్తం చేశారు. యూనిట్ విద్యుత్‌ని రూ.11కి కొనుగోలు చేసి దీని భారం ప్రజలపై వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.