విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఇసుకను అక్రమంగా అమ్ముకున్న ఆ పార్టీ నాయకులు ఇప్పుడు మద్యంపై పడ్డారని...  వారి కనుసన్నల్లోనే మద్యం అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఉమ డిమాండ్  చేశారు. 

''ఏడాదిపాలనలో 13లక్షల టన్నుల ఇసుక వైసీపీ నేతలు మాయంచేశారని చంద్రబాబు చెప్పారు. లారీ లోడ్ అవ్వాలంటే వెయ్యి ఇవ్వాల్సిందే. అధికారులు ఇవ్వాల్సిన ఇసుక ఆన్ లైన్ కూపన్లు సైతం మీపార్టీ నేతల ఇంటివద్దే పంపిణీ. మీనాయకులు చేస్తున్న వేలకోట్ల ఇసుకదోపిడీకి ఏంసమాధానం చెప్తారు వైఎస్ జగన్ గారు'' అంటూ ట్విట్టర్ వేదికన నిలదీశారు. 
 
''ప్రభుత్వషాపుల్లో నాసిరకం మద్యం... బయట రాష్ట్రాలనుండి విచ్చలవిడిగా NDP లిక్కర్. మీపార్టీనేతల కనుసన్నల్లోనే బ్రాండ్లమద్యం  అమ్మకాలు. రాష్ట్రంలో సారా ఏరులైపారుతుంది. నాసిరకం మద్యం,సారాలతో పోతున్న ప్రజల ప్రాణాలకు, మీనేతల బ్రాండ్ బాజాకు ఏం సమాధానం చెప్తారు వైఎస్ జగన్ గారు'' అంటూ దేవినేని ఉమ సోషల్ మీడియా ద్వారా వైసిపి నాయకులపై విరుచుకుపడ్డారు. 

read more  అసలీ లంకారెడ్డి ఎవరు? ఆ కాంట్రాక్ట్ ఆయనకే ఎందుకంటే: జగన్ పై ఉమ ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ మూడు సార్లు భోజనం చేసి ఏపీ ఆస్తులను అప్పజెప్పడానికి సిద్దమయ్యారంటూ ఉమ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు.  విద్యుత్ బకాయిలు 5వేల కోట్లు రావాలి.... వీటిని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు తమ విధానం చెప్పమంటున్నారంటూ  విరుచుకుపడ్డారు. వైసీపీది దోచుకునే విధానమని... రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ తన సొంత వాళ్లకు పనులు ఇచ్చారని ఆరోపించారు.టిడిపి సమగ్ర జల విధానంతో అభివృద్ధి చేయడం జరిగిందని దేవినేని ఉమ అన్నారు. 


వివిధ విషయాలపైద హైకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి చెంపపెట్టు అని ధ్వజమెత్తారు. దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపిందని... దీనిపై దేశ, అంతర్జాతీయ మీడియా ప్రభుత్వ తీరును ఎండగట్టిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ కు ఎక్కడా గాయాలు లేవని చెప్పడంతో.. ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడం చూశామన్నారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఉమ డిమాండ్ చేశారు.