ప్రకాశం: ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను కేవలం ఏడాది పాలనలోనే అమలుచేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు అద్భుతంగా  వున్నాయని... ఇంత గొప్పగా రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించకుండా వుండలేకపోతున్నానని అన్నారు.  

టిడిపి అనవసరంగా వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇలా చంద్రబాబు ఓ వైపు వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసినా...మరోవైపు ప్రజలు ఈ పాలన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. కాబట్టి ఇకనైనా విమర్శలు మానుకుని ఎన్నికల్లో తమ పార్టీ  ఓటమిపై టిడిపి నాయకులు సమీక్షించుకుంటే మంచిదని బలరాం సూచించారు. చంద్రబాబు వల్ల ఏపీ నష్టపోయిందని ఆయన అన్నారు.

read more   పార్టీ ఏం చేసిందో గుర్తు చేసుకోండి: జగన్‌తో కరణం భేటీపై చంద్రబాబు స్పందన

ప్రస్తుత రాజకీయాల్లో విలువలకు చోటు లేదంటూ బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ అభివృద్దికోసం రాజకీయ నాయకులు ఏమయినా చేయడానికి సిద్దపడుతున్నారని అన్నారు. 

వెలిగొండ ప్రాజెక్టును గత ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రస్తుతం వైసిపి పాలనలో ఈ  ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇక రైతులు పండించిన పంటను వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని అన్నారు. 

వరుస షాక్‌లతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీకి ఇటీవలే మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతు ప్రకటించారు. సీఎం జగన్ తో సమావేశమైన బలరాం తన కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్పించారు. ఆయన మాత్రం పార్టీ కండువా కప్పుకోకుండా బయటి నుండే వైసీపీకి మద్దతిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకున్నా పార్టీ కోసం పని చెయడానికి బలరాం సిద్దమయ్యారు. 

ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్దతలకాయగా ఉన్న కరణం బలరామ్‌ను వైసీపీకి దగ్గరయ్యేలా చేసింది మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు. వారు పలుమార్లు ఆయనతో చర్చలు జరిపి వైసిపికి మద్దతుగా నిలిచేలా చేశారు. గత ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బలరాం తన చిరకాల ప్రత్యర్ధి గొట్టిపాటి రవిని చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇది కూడా అతడు టిడిపికి దూరమయ్యేందుకు ఓ  కారణమయ్యింది.