ఆందోళనకరంగా జగన్ మానసిక స్థితి .. సీఎం కుర్చీలో జగన్ అనర్హుడు , జనం మాట ఇదే : లోకేష్ వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . ముఖ్యమంత్రి కుర్చీలో వుండేందుకు జగన్ అనర్హుడని .. చంద్రబాబుపై రోజుకొక తప్పుడు కేసు పెడుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మానసిక స్థితి ఆందోళనకరంగా వుందని, దీనిపై కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపాలని కోరారు. ముఖ్యమంత్రి కుర్చీలో వుండేందుకు జగన్ అనర్హుడని .. చంద్రబాబుపై రోజుకొక తప్పుడు కేసు పెడుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే జగన్ మానసిక స్థితిపై ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. కక్షతో రగిలిపోతున్న సీఎం తీరు ఎలా వుందో రాష్ట్ర ప్రజలకు అర్ధమైందని.. సీఐడీని వైసీపీ అనుబంధ విధంగా మార్చేశారని నారా లోకేష్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి స్థానంలో వున్న వ్యక్తి ఇలా చేయడం సరికాదని.. విపక్షాన్ని వేధించేందుకు వ్యవస్ధలను మేనేజ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం దేశంలో ఎక్కడా లేదని లోకేష్ విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూపాయి అవినీతి జరగకపోయినా.. అక్రమ కేసు పెట్టారని, నేటికీ ఒక్క ఆధారం కూడా చూపించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేయని రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని ఒకటి.. ఉచితంగా ఇసుక అందుబాటులో వుంచినందుకు స్కామ్ అంటూ మరో కేసు పెట్టారని లోకేష్ ఫైర్ అయ్యారు.
Also REad: చంద్రబాబుకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఇవే...!
ఇకపోతే..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఆయనపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సీఐడీ ఏ2గా చేర్చింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ 3గా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , ఏ 4గా మాజీ మంత్రి దేవినేని ఉమాలను చేర్చింది.
ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారనే ఫిర్యాదుతో చంద్రబాబు తదితరులపై కేసులు నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్‌మెంట్, అసైన్డ్ ల్యాండ్స్, ఫైబర్ నెట్ కేసులను సీఐడీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.