సారాంశం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను ఏ14గా చేర్చడంపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. 

అమరావతి : ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో లోకేష్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తోంది సిఐడి. ఈ వ్యవహారంపై కూడా విచారణ జరుపుతున్న సిఐడి లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ14గా పేర్కొంటూ సీఐడీ అధికారులు కోర్టులో మెమోను  అందించారు. 

ఇలా తన అరెస్ట్ కు జరుగుతున్న ప్రయత్నాలపై లోకేష్ స్పందించారు. 'యువ‌గ‌ళం పేరు వింటే సైకో జ‌గ‌న్ గ‌జ‌గ‌జ‌లాడుతున్నాడు. నా పాద‌యాత్ర ఆరంభం కాకూడ‌ద‌ని జీవో 1 తెచ్చాడు. అయినా ఆగ‌ని యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మై గ‌ర్జించింది. ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకున్నా జ‌న‌ జైత్రయాత్ర‌గా ముందుకు సాగింది'' అని లోకేష్ అన్నారు. 

Read More  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌తో నారా లోకేష్ భేటీ..

''మ‌ళ్లీ యువ‌గ‌ళం ఆరంభిస్తామ‌నే స‌రికి గతంలో నేను మంత్రిగా చేసిన శాఖ‌కి సంబంధంలేని, అస‌లు వేయ‌ని రింగ్ రోడ్డు కేసులో న‌న్ను ఏ14గా చేర్పించారీ 420 సీఎం. రిపేర్ల పేరుతో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం బ్రిడ్జి మూసేయించారు. ఇలా నువ్వెన్ని త‌ప్పుడు కేసులు పెట్టి, అక్ర‌మ అరెస్టులు చేసినా నా యువ‌గ‌ళం ఆగ‌దు. ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా జ‌న‌చైత‌న్య‌మే యువ‌గ‌ళాన్ని వినిపిస్తుంది, ఇచ్ఛాపురం వ‌ర‌కూ న‌డిపిస్తుంది'' అంటూ లోకేష్ ఎక్స్(ట్విట్టర్) వేదికన స్పందించారు. 

అసలేంటి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు :

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం పూనుకుంది. గుంటూరు ప్రాంతంలో అమరావతి పేరిట రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు సర్కార్ చేపట్టింది. ఇందుకోసం రైతుల నుండి భారీగా భూములు సేకరించారు. ఇలా రాజధాని కోసం సేకరించిన భూములను చంద్రబాబు, మంత్రులు, టిడిపి నాయకులు కొట్టేసారని వైసిపి ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్పులు చేసినట్లు వైసిపి ఆరోపిస్తూ వస్తోంది. 

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ ఈ వ్యవహారంపై సిఐడితో విచారణ చేయించింది. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ,  నారా లోకేష్, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్‌కె హౌసింగ్ లిమిటెడ్‌కి చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామ కృష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రై. లిమిటెడ్‌లతో పాటు ఇతరులను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ కేసులోనే తాజాగా లోకేష్ ను ఏ14గా చేర్చింది సిఐడి.