Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కు ‘‘ మైతోమేనియా సిండ్రోమ్ ’’ .. దాని లక్షణాలివే : నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

జగన్‌కు మైతోమేనియా సిండ్రోమ్ అనే జబ్బు ఉందని.. దీని ప్రకారం ఉన్నది లేనట్లు.. లేనది ఉన్నట్లు చెబుతారని సెటైర్లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . రూ.1000  ఖరీదైన బాటిల్ నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని లోకేష్ దుయ్యబట్టారు.  

tdp leader nara lokesh sensational comments on ap cm ys jagan ksp
Author
First Published Feb 11, 2024, 9:47 PM IST | Last Updated Feb 11, 2024, 9:48 PM IST

రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ‘‘శంఖారావం’’ యాత్రలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ .. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక వలసలు లేని ఉత్తరాంధ్రగా తీర్చిదిద్దుతామని లోకేష్ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సెజ్ ఏర్పాటు చేస్తామని దాని ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అని ... జగన్ విముక్త ఏపీనే అందరి లక్ష్యం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అమ్మలాంటిది .. అమ్మప్రేమకు కండీషన్స్ ఉండవని.. ఉత్తరాంధ్రుల ప్రేమాభిమానాలకు కూడా కండీషన్స్ లేవన్నారు. 

పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని.. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన నేల ఇది అని లోకేష్ గుర్తుచేశారు. జగన్‌ను చూస్తే జాలేస్తోందని... పద్దాక సిద్ధం అంటున్నారని, దేనికి సిద్ధం అని లోకేష్ ప్రశ్నించారు. నువ్వు జైలుకు వెళ్లడానికి సిద్ధమా.? మేము అందరం కలిసి నిన్ను జైలుకు పంపడానికి మాత్రం సిద్ధమంటూ ఆయన సెటైర్లు వేశారు. శ్రీకాకుళం జిల్లాకు జగన్ 60 హామీలిచ్చారని.. ఒక్క హామీనైనా అమలు చేశారా ? ఒక్క సాగునీటి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశాడా.? వంశధార, తోటపల్లి కడి, ఎడమ కాల్వలు పూర్తి చేస్తామని చెప్పి మోసం చేశారని లోకేష్ దుయ్యబట్టారు. నాగావళి కరకట్ట పనులు కూడా పూర్తి చేస్తామని చేయకుండా మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విశాఖను జాబ్ కేపిటల్ గా తీర్చిదిద్దితే జగన్ గంజాయి కేపిటల్ గా మార్చారని లోకేష్ ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ కు స్థలం కేటాయించలేదని.. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని మాటిచ్చారని.. ఒక్కటన్నా తెరిపించాడా అని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి కారణం ఉక్కుఫ్యాక్టరీ అని.. ఎంతోమంది పోరాడి ఉక్కుఫ్యాక్టరీ తీసుకొచ్చారని.. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ సంస్థలతో లాలూచీ పడి దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వమని.. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాపట్లలో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్  నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపారని.. దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి చంపారని లోకేష్ ధ్వజమెత్తారు. 

విశాఖలో భూ కుంభకోణాలకు అడ్డుపడ్డారని ఎమ్మార్వో రమణయ్యను కొట్టి చంపారని.. బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పూజిత ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణమని నారా లోకేష్ ఆరోపించారు. విజయనగరంలో వైసీపీ నేతలు సిమెంట్ తీసుకెళ్లి తిరిగి ఇవ్వకపోవడంతో జె.ఈ రామకృష్ణ కార్యాలయంలోనే ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని లోకేష్ ప్రశ్నించారు. కొత్తగా జగన్ డీఎస్సీ నాటకానికి శ్రీకారం చుట్టారని... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని దుయ్యబట్టారు. 

కానీ ఎన్నికలు వస్తున్నాయని 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెబుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి 1.70 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ వచ్చాక యేటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్‌కు మైతోమేనియా సిండ్రోమ్ అనే జబ్బు ఉందని.. దీని ప్రకారం ఉన్నది లేనట్లు.. లేనది ఉన్నట్లు చెబుతారని ఆయన సెటైర్లు వేశారు. సాక్షి టీవీ, సిమెంట్ కంపెనీ, పవర్ కంపెనీ, లక్ష రూపాయల చెప్పులు వేసుకుని తిరిగే జగన్ పేదవాడు ఎలా అవుతారని ఆయన నిలదీశారు. రూ.1000  ఖరీదైన బాటిల్ నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని లోకేష్ దుయ్యబట్టారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios