ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు ప్రకటించడంపై టిడిపి నాయకులు నారా లోకేష్ సెటైర్లు వేసారు. 

అమరావతి: ప్రస్తుతం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (mekapati goutam reddy) నేతృత్వంలో ఏపీ పరిశ్రమల శాఖ (ap industrial ministry) అధికారులతో కూడిన ఓ బృందం దుబాయ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వివిధ అంతర్జాతీయ కంపనీలు ఏపీలో పెట్టుబడులకు సిద్దంగా వున్నాయని మేకపాటి పేర్కొన్నారు. ఇప్పటికే మూడువేల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకున్నట్లు... ఇంకా పలు కంపనీలు ఏపీలో పెట్టబడులకు సిద్దంగా వున్నాయని మంత్రి మేకపాటి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) సైటైర్లు వేసారు. 

''ఖాళీ కుర్చీలకి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు? పైగా జగన్ గురించి పెద్దగా ఇక్కడ ఎవరికి తెలియదని సెలవివ్వడం మీ స్పీచ్ కే హైలెట్! చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న కంపెనీలు మీ ఘనత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఏపి పరువు గంగలో కలిసిపోయింది. కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకెలాగో చేతకాదు కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అదే పదివేలు'' అంటూ లోకేష్ ఎద్దేవా చేసారు. 

ఇదిలావుంటే ఇప్పటికే లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఎంవోయూ చేసుకున్నట్లు మంత్రి మేకపాటి బృందం ప్రకటించింది. అలాగే రీజెన్సీ గ్రూప్ కూడా రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చి ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. "ఫ్లూయెంట్ గ్రిడ్" అనే ఎస్సార్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ లో భాగమైన ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో కూడా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు మంత్రి మేకపాటి ప్రకటించారు.

తాజాగా అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు పరిశ్రమల శాఖ ప్రకటించింది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్ లు), వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. 

అబుదాబీలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ను కలిశారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సాగుతున్న దుబాయ్ పర్యటన వెనుక గల ఎంబసీ సహకారంపై మంత్రి మేకపాటి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో గల అవకాశాల గురించి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అబుదాబీలోని ఇండియా ఎంబసీలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఏపీలో ఏఏ రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో కూలంకషంగా ఏపీఈడీబీ సీఈవో ప్రజంటేషన్ ఇచ్చారు.

పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లు, రాష్ట్రం నలుమూలలకు వెళ్లేలా జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, కడప స్టీల్ ప్లాంట్, టెక్స్ టైల్ పార్కులు, మల్టీ లాజిస్టిక్ పార్కులు, త్వరలో కొలువుదీరనున్న పెట్రోలియం కాంప్లెక్స్ వంటి చౌక వాణిజ్యానికి గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి మేకపాటి పారిశ్రామికవేత్తలను కోరారు..