ఆయనొక గెస్ట్ లెక్చరర్.. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై నారా లోకేశ్ సెటైర్లు
వైసీపీ (ysrcp) నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై (alla ramakrishna reddy) టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) మండిపడ్డారు. రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్ గా మారారంటూ సెటైర్లు వేశారు
వైసీపీ (ysrcp) నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై (alla ramakrishna reddy) టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ..రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్ గా మారారంటూ సెటైర్లు వేశారు. వారానికోసారి గౌతమ బుద్దా రోడ్డు ముందు నాలుగు ఫోటోలు దిగి జంప్ అయిపోతారంటూ లోకేశ్ కామెంట్ చేశారు. మంగళగిరిలో అభివృద్ధి జీరోని.. పేదల ఇల్లు కూల్చడం మాత్రం ఫుల్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న నియోజకవర్గంలోని అభివృద్ధికి దిక్కులేదని.. అత్యంత చెత్త ముఖ్యమంత్రుల జాబితాలో దేశంలోనే జగన్ రెడ్డి (ys jagan mohan reddy) నెంబర్ వన్ అంటూ నారా లోకేశ్ దుయ్యబట్టారు.
జగన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారని.. దొంగల భయంతో ప్రజలకి రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, మీ పేరుమీద భూమి ఉందని పెన్షన్లు ఎత్తేస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వేలాదిగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తొలగించారని... గెలిచిన వెంటనే ఇళ్ల పట్టాలు ఇస్తానని ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. లోకేష్ గెలిస్తే ఇళ్లు పీకేస్తాడని ప్రచారం చేసిన ఆర్కే ఇప్పుడు పేదవాళ్ల ఇల్లు కొట్టడం దారుణమన్నారు. టిడ్కో ఇళ్లు కేటాయించకుండా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:ఇది ప్రాజాస్వామ్యమా? అవ్వను అవమానించారు: రాష్ట్ర సర్కారుపై టీడీపీ ఫైర్
మంగళగిరి (mangalagiri) నియోజకవర్గానికి రెండు బడ్జెట్లలో రూ.2800 కోట్లు కేటాయించారు. కానీ ఒక్క పైసా కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చెయ్యలేదని.. ఆఖరికి గౌతమ బుద్దా రోడ్డు కూడా కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుండే వేస్తున్నారని లోకేశ్ చెప్పారు. ప్రభుత్వం నుండి రూపాయి కూడా కేటాయించకుండా... కార్పొరేషన్ పరిధిలో ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన డబ్బు వాడేశారని ఆయన దుయ్యబట్టారు. ఆఖరికి డివైడర్ ఏర్పాటులో కూడా అవినీతి చేశారని... అసలు టెండర్లు ఖరారు కాకముందే డివైడర్ కొట్టేసారంటూ లోకేశ్ మండిపడ్డారు.
కోటి 20 లక్షలతో కట్టిన డివైడర్ తీసేసి ఇప్పుడు కోటి 50 లక్షలతో కొత్త డివైడర్ నిర్మాణం చేస్తారా... డివైడర్ కొట్టడానికి 16 లక్షలు ఖర్చు చేశారట అంటూ ఆయన సెటైర్లు వేశారు. సీఎం ఉంటున్న నియోజకవర్గంలో ఇప్పటికీ ర్యాంపులు ఉన్నా ఇసుక అందుబాటులో లేదని.. ఇక్కడ ఇసుకంతా ఎక్కడికి పోతోందని ఆయన ప్రశ్నించారు. ఇసుకాసురులు ఎవరు..? అందులో ఎమ్మెల్యే వాటా ఎంత అంటూ లోకేశ్ నిలదీశారు. కొండపోరంబోకు స్థలాల్లో ఇళ్ల పట్టాలు కేటాయించింది టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని.. గెలిస్తే పట్టాలు ఇస్తామని ఇప్పుడు పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.
రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే నేను తిరిగినంత కూడా తిరగలేదని.. నిన్న ఒక్క రోజే 30 మంది వృద్ధుల పెన్షన్లు పీకేసారని ఆయన చెప్పారు.
వన్ టైం సెటిల్మెంట్ (ots scheme) పెద్ద కుట్ర అని.. 10 వేలు కట్టడం ఒక భాగం మాత్రమేనని, రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత అసలు వేధింపులు మొదలవుతాయని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. 10 వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత మీ పేరు మీద ఇళ్లు ఉందని పెన్షన్, రేషన్ కార్డు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అన్నీ రద్దు చేస్తారని ఆయన ఆరోపించారు. ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా కట్టోద్దని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.