ఏపీలో ఎలక్షన్లు లేవు.. వైసీపీ సెలక్షన్ మాత్రమే వుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేశ్. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం గొల్లప్రోలులో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు

ఏపీలో ఎలక్షన్లు లేవు.. వైసీపీ సెలక్షన్ మాత్రమే వుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేశ్. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం గొల్లప్రోలులో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు.

పల్లెల్లో గెలిచామని.. పట్టణాల్లో ధైర్యంగా నిలిచామని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకే ఒక్క అవకాశం ఇవ్వమన్న జగన్..జనానికి బతికే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు.

పెంచుకుంటూ పోతానని జగన్ రెడ్డి ఇచ్చిన ఈ మాట మాత్రం అస్సలు తప్పలేదని.. ఉప్పు, పప్పు, నూనెలు, బియ్యం, పంచదార అన్నీ ధరలు పెంచుకుంటూ పోతూనే వున్నారంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.

పాదయాత్రలో విసిరిన ముద్దులు ట్రైలర్ మాత్రమేనని.. పిడిగుద్దులతో అసలు సినిమా ఇప్పుడు చూపిస్తున్నాడంటూ ఆయన ధ్వజమెత్తారు. అమ్మ ఒడిలో 14 వేలేసి...నాన్న జేబులోంచి 36 వేలు కొట్టేశారని, ఆటో ఓనర్‌కి 10 వేలిచ్చి...డ్రైవర్ నుంచి 20 వేలు లాగేస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు.

అబద్ధానికి ఫ్యాంట్, అవాస్తవాలకు షర్టూ వేస్తే అచ్చం జగన్‌లాగే వుంటుందని ఆయన సెటైర్లు వేశారు. ఢిల్లీని గడగడలాడిస్తానన్న జగన్ .. ఢిల్లీ పేరెత్తితేనే గజగజ వణుకుతున్నాడని ఎద్దేవా చేశారు.

పరిపాలనని కూడా కక్ష తీర్చుకోవడానికి వాడుకుంటున్న ఫ్యాక్షన్ సీఎం జగన్ రెడ్డే అంటూ లోకేశ్ విమర్శించారు. టిడిపి ప్రభుత్వం కియా, హెచ్‌సీఎల్, అశోక్ లే ల్యాండ్ వంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చిందని.. జగన్ ప్రెసిడెంట్ మెడల్, హెచ్‌డీ స్పై విస్కీ వంటి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారంటూ సెటైర్లు వేశారు.

జగన్ రెడ్డి రేంజు కూడా ఈడీ నుంచి ఇంటర్‌పోల్‌కి పెరిగిందంటూ లోకేశ్ దుయ్యబట్టారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానని... ఏకంగా విదేశాలే ఏపీ వైపు చూసేలా చేశాడని ఆరోపించారు. ఒక్కడికి మూడు రాష్ట్రాలలో ఎకరాలలో ప్యాలెస్‌లు వుంటే పేదోడికి మాత్రం సెంటు స్థలం శ్మశానంలో ఇస్తారంటూ లోకేశ్ మండిపడ్డారు.