గుంటూరు: కరోనా వైరస్ పై క్షేత్రస్థాయిలో పోరాడుతున్న వైద్యులు, అధికారులపై వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దారుణంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వైరస్ బారిన పడకుండా తమకు రక్షణ సదుపాయాలు  కల్పించాలని కోరినందుకే మొన్న డాక్టర్ ను, ఇప్పుడు ఓ అధికారిపై వేటు వేయడంపై ముఖ్యమంత్రిని సోషల్ మీడియా వేదికన నిలదీశారు నారా లోకేశ్.  

''ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన నడుస్తుంది. చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా వైఎస్ జగన్ గారు?అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసారు. మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొనడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు'' అని లోకేశ్ ఆరోపించారు. 

''కరోనాని ఎలా నివారించాలి అని అడిగినందుకు నగరి కమిషనర్ వెంకట్ రామిరెడ్డి ని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికల ముఖ్యం అని నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారణం అయిన జగన్ గారికి ఎం శిక్ష వెయ్యాలి?'' అని ప్రశ్నించారు.

''జగన్ గారి అసమర్ధత వలన కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు కూడా కరోనా భారిన పడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా సోకింది. డాక్టర్లు విధులు బహిష్కరించే పరిస్థితి వచ్చింది'' అన్నారు.

''పండించిన పంట ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళిక లేకపోవడంతో నేలపాలు అవుతుంది. ఇది ఒక్క రైతు సమస్య కాదు రాష్ట్ర రైతాంగం మొత్తం సంక్షోభంలో ఉంది'' అంటూ రైతుల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 
 
''ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడానికి యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అకాల వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణమే ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి పరిహారం చెల్లించాలి'' అని డిమాండ్ చేశారు. 

''లాక్ డౌన్ తో పేద ప్రజలు అల్లాడుతున్నారు.లాక్ డౌన్ పొడిగింపు వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయి.పనులు లేవు,తినడానికి తిండి లేదు,ఎక్కడకి కదలలేని పరిస్థితి.అప్పు పుట్టే అవకాశం కూడా లేదు.సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న పేద కుటుంబాలను వైఎస్ జగన్ గారు ఆదుకోవాలి'' అని సూచించారు. 

''తక్షణమే 5 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని కోరుతున్నాను. రైతుల కష్టాలు వర్ణనాతీతం. మద్దతు ధర లేదు,రవాణా సౌకర్యం లేదు.లాక్ డౌన్ దెబ్బకి పండిన పంట పొలాల్లోనే వదిలేస్తున్నారు'' అంటూ లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

''అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. లాక్ డౌన్,అకాల వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అంచనా వెయ్యాలి.రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపాలి'' అంటూ ట్విట్టర్ వేదికన వరుస ట్వీట్ల ద్వారా జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు నారా లోకేశ్.