ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేత నారా లోకేష్‌ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అనుస‌రించిన.. డిజిట‌ల్ వాల్యూయేషన్‌పై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని లోకేష్ కోరారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేత నారా లోకేష్‌ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అనుస‌రించిన.. డిజిట‌ల్ వాల్యూయేషన్‌పై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని లోకేష్ కోరారు. రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన కొందరి వల్ల.. గ్రూప్-1 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ముందస్తు అధ్యయనం లేకుండా డిజిటల్ వాల్యూయేషన్‌ను ఎంచుకోవడం అనేక విమర్శలకు తావిస్తోందని లేఖలో లోకేష్‌ పేర్కొన్నారు.

లోకేశ్ లేఖలో ఏమన్నారంటే.. ‘‘ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అనుస‌రించిన డిజిట‌ల్ వేల్యూష‌న్ పై అభ్య‌ర్థులు అనుమానాలు వ్య‌క్తం చేస్తోన్న నేపథ్యంలో గవర్నర్ జోక్యం చేసుకొని న్యాయం చెయ్యాలి.రాజ్యాంగబద్దమైన సంస్థ ఏపీపీఎస్సీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పై తక్షణమే గవర్నర్ ద్రుష్టి సారించాలి.గత రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా నియమింపబడిన కొంతమంది రాజకీయ వ్యక్తుల కారణంగా గ్రూప్-1 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది.2018లో జారీ అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు మెయిన్స్ రాత పరీక్ష గత ఏడాది డిసెంబర్ లో జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు. దాదాపు 7000 మంది అభ్యర్థుల్లో ఇంటర్వ్యూ రౌండ్‌కు స్పోర్ట్స్ కోటా తో కలిపి 340 మంది ఎంపికయ్యారు.ఎలాంటి ముందస్తు అధ్యయనం లేకుండా డిజిటల్ వేల్యూష‌న్‌ని ఎంచుకోవటం అనేక విమర్శలకు తావిస్తోంది.

ఇటీవల గ్రూప్-1 అభ్యర్థులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తమకి జరిగిన అన్యాయాన్ని అభ్యర్థులు వివరించారు.యూపీఎస్సి పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు సైతం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించలేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. డిసెంబర్ 31,2018 న ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న మార్గదర్శకాలకు విరుద్ధంగా డిజిటల్ వేల్యూష‌న్‌ ఎంచుకోవడం వలన వేలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది.అభ్యర్థులకు ఉన్న అనుమానాలను నివృత్తి చెయ్యాల్సింది పోగా సమాచార హక్కు చట్టం కింద ప్రశించిన అందరి అభ్యర్థులకు ఒకే సమాధానం ఇవ్వడం వలన ఏపీపీఎస్సీ పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది. 

Also Read:ఏపీలో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర... సీఎం జగన్ పై లోకేష్ ట్రోలింగ్

ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయిన అభ్యర్థుల పేర్లు,రోల్ నెంబర్లు విడుదల చెయ్యకపోవడం అవకతవకలు జరిగాయి అనడానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.మాన్యువల్ వేల్యూష‌న్ చేయ‌డం కోసం రూపొందించిన జవాబు పత్రాలను డిజిటల్ పద్దతిలో చేయటం వల్ల అర్హులైన వారు నష్టపోయారు.అభ్యర్థులంతా డిజిటల్ వేల్యూష‌న్‌కి సంబంధించిన సాంకేతికత SOP పై శ్వేతపత్రాన్ని విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

గత టిడిపి ప్రభుత్వం గ్రూప్-1,2 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించింది.కానీ ఈ ప్రభుత్వ హయాంలో తీసుకొన్న కొన్ని నిర్ణయాల వలన అవకతవకలు చోటుచేసుకున్నాయి.ఏపీపీఎస్సీ ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ప్రతిష్టని దెబ్బతిస్తున్నారు.మాన్యువల్ వేల్యూష‌న్ చేసి తమకు న్యాయం చెయ్యాలంటూ 300 మందికి పైగా అభ్యర్థులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ఏపీపీఎస్సీ ఆసక్తి చూపించకపోవడం వలనే పరిస్థితి చేదాటింది.

రాష్ట్రానికి సేవ చెయ్యాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆధారాలతో సహా చేస్తున్న ఆరోపణలు ఇవి.స్కూల్ పరీక్షలు నిర్వహించి తీరుతాం అని చెబుతున్న ప్రభుత్వం కరోనా కారణంగా గ్రూప్-1 లో డిజిటల్ వేల్యూష‌న్‌ చెయ్యాల్సి వచ్చిందని చెప్పడం ద్వారా జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.ఏపీపీఎస్సీ సభ్యులను నియమించే అధికారం ఉన్న మీరు తక్షణమే జోక్యం చేసుకొని అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలి.సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.ఏపీపీఎస్సీ పై నిరుద్యోగ యువతకు తిరిగి నమ్మకం కలిగేలా ప్రక్షాళన చెయ్యాలి.’’ అని ఆయన గవర్నర్ ను కోరారు.