నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రామకృష్ణ అనే లెక్చరర్ సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. డ్యూటీ డాక్టర్ ఉండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేయించ‌డం ఏంట‌ని ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ ఫైరయ్యారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై (ys jagan) టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ (nara lokesh) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రమాదంలో గాయపడిన రామకృష్ణ అనే లెక్చరర్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం నారా లోకేశ్ అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ... ప్రజారోగ్య దేవుడిగా ప్ర‌చారం చేసుకుంటోన్న జ‌గ‌న్ వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా త‌యార‌య్యార‌ని దుయ్యబట్టారు. 

గాయపడిన లెక్చరర్ రామకృష్ణ (lecturer rama krishna) నెల్లూరు జిల్లా (nellore) ఆత్మకూరు ప్రభుత్వ ఆసుప‌త్రిలో చేరడమే శాపమా? అని లోకేష్ ప్రశ్నించారు. డ్యూటీ డాక్టర్ ఉండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేయించ‌డం ఏంట‌ని ఆయన నిల‌దీశారు. ఏపీలో జ‌గ‌న్‌కి ప్ర‌జ‌లు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని నారా లోకేష్ దుయ్యబట్టారు. కక్షసాధింపు చ‌ర్య‌లే ల‌క్ష్యంగా జగన్ ప్రభుత్వం ప‌నిచేస్తోంటే ఏపీలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనాల‌ ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యేన‌ని నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో (govt hospitals in ap) పరిస్థితులు దిగజారుతున్నా స‌ర్కారు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆయన మండిపడ్డారు. 

మరోవైపు ఈ ఘటనపై జనసేన (janasena) నేత నాదెండ్ల మనోహర్ (nadendla manohar) సైతం ఫైరయ్యారు. ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందించ‌డంలో అంతులేని నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఏపీ స‌ర్కారుపై ఆయన మండిపడ్డారు. సెక్యూరిటీ గార్డులు, స్వీప‌ర్లే వైద్యులా? అని నాదెండ్ల మనోహర్ నిల‌దీశారు. వైద్య ఆరోగ్య శాఖ‌ను నిర్వీర్యం చేసిన ఘ‌నత జ‌గ‌న్‌దేన‌ని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో రోజు రోజుకీ వైద్య సేవ‌లు దిగ‌జారుతుండ‌డం వైసీపీ స‌ర్కారు వైఫ‌ల్యాన్ని సూచిస్తోంద‌న్నారు.