రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు జిల్లా మంగళగిరిలో ధర్నాకు దిగారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మూసేసిన అన్న క్యాంటీన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత కారణంగా తాము ఉపాధిని కోల్పోయినట్లు లోకేశ్ ఎదుట వాపోయారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. ఇసుక దొరకని కారణంగా తాపీ మేస్త్రులు, కూలీలు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఇలా అందరి ఉపాధి పోయిందన్నారు.

కొత్త విధానాలతో ఇసుక ధర తగ్గిస్తామని సీఎం చెప్పారని కానీ.. ఒక్కసారిగా 9 రెట్లు ధర ఎందుకు పెరిగిందని లోకేశ్ ప్రశ్నించారు. అన్నాక్యాంటీన్ల వద్ద మూడు పూటలా భవన నిర్మాణ కార్మికులు భోజనం చేసేవారని.. కానీ జగన్ వాటిని కూడా మూసేశారని ఎద్దేవా చేశారు.

భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్దేశించిన చంద్రన్న బీమా పథకాన్ని సైతం జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని లోకేశ్ ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసనకు తరలివస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇసుక ధర తగ్గేవరకు టీడీపీ పోరాటం చేస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.